
శ్రమదానంతో ఆరోగ్య సమాజం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రతిఒక్కరూ రోజూ కనీసం కొంత సమయం పాటు శ్రమదానం చేస్తే ఆరోగ్యవంతమైన పట్టణాలు, గ్రామాలుగా కళకళలాడతాయని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్‌కుమార్‌రెడ్డి సూచించారు. స్థానిక పంపుల హెడ్ వాటరు వర్క్స్ వద్ద గురువారం స్వచ్ఛతా హీ సేవ – 2025లో భాగంగా ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ అనే థీమ్‌తో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి ఆయన ప్రత్యేక శుభ్రతా డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మంచిసేవలు అందించిన క్లాప్ మిత్రలకు అక్టోబరు 02న రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే విజయవాడలో సభలో బహుమతులు అందించి సన్మానిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎ.భాను ప్రతాప్, జెడ్పీ సీఈఓ ఎం.శ్రీహరి, డిప్యూటీ కమిషనర్ బీ. శివారెడ్డి పాల్గొన్నారు.