
కార్పొరేషన్ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరంలోని పలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్‌లో ఉన్న ఏకోపాధ్యాయ ఎలిమెంటరీ పాఠశాలలకు క్లస్టర్‌లలో ఉన్న మిగులు ఉపాధ్యాయుల నుంచి ప్రతి ఏకోపాధ్యాయ పాఠశాలకు ఒకరినైనా పూర్తి విద్యా సంవత్సరం కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలోనే అత్యధిక విద్యార్థులు కలిగిన కస్తూరిబా బాలికోన్నత పాఠశాలకు క్లస్టర్‌లో మిగులు ఉన్న ఉపాధ్యాయుల నుంచి అవకాశం మేరకు కొందరిని సర్దుబాటు చేస్తే విద్యార్థినులకు మరింత నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. క్లస్టర్ల నుంచి ఎలిమెంటరీలకు సర్దుబాటు చేసే ఉపాధ్యాయుల్లో ప్రతి ఎలిమెంటరీ పాఠశాలకు గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులు కలిగిన ఉపాధ్యాయులను క్లస్టర్లతో సంబంధం లేకుండా సర్దుబాటు చేస్తే విద్యార్థులకు కనీస సామర్థ్యాలు నేర్పే అవకాశం ఉంటుందన్నారు. కొందరు మండల విద్యాశాఖాధికారులు పాఠశాలలకు చెందిన పుస్తకాలు, ఇతర సామగ్రిని మండల కేంద్రానికి వచ్చి తీసుకువెళ్లాలని ప్రధానోపాధ్యాయులకు సూచిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల వద్దకే సంబంధిత సామగ్రిని చేర్చేలా ఎంఈవోలకు తగు సూచనలివ్వాలని కోరారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లోని కొందరు ప్రధానోపాధ్యాయులు పీజీటీ ఉపాధ్యాయులకు వివిధ రకాల సెలవుల విషయంలో అస్పష్టతతో ఉన్నందున వారికి పాఠశాల విద్య నిబంంధనల ప్రకారం సెలవులు ఇవ్వటానికి, ఇంటర్మీడియెట్ అదనపు అధ్యయన తరగతుల విషయంలో పాఠశాల విద్య నిబంధనల ప్రకారం సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల మాత్రమే విధులు నిర్వహించేలా తగు సూచనలు జారీ చేయాలని కోరారు. డీఈఓకు వినతిపత్రం సమర్పించిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు, డీకేఎస్‌ఎస్ ప్రకాశ రావు, నగర అధ్యక్షుడు కే. ఆనంద కుమార్ తదితరులున్నారు.