
రోడ్డెక్కిన ఉద్యోగులు
మొండి వైఖరితోనే రోడ్లెక్కే పరిస్థితి
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా సంఘం ఆధ్వర్యంలో నిరసన వారం నిర్వహించి, రోజుకో రీతిలో ప్రభుత్వానికి నిరసన తెలిపాం. అయినా ప్రభుత్వంలో స్పందన కనిపించలేదు. అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయిలో మా సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటించింది.
– తాళ్ళూరి రామారావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం బకాయిపడిన 4 డీఏలను వెంటనే విడుదల చేయాలి. హీనపక్షంలో దసరా కానుకగా కనీసం రెండు డీఏలనైనా విడుదల చేయాలి. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ పీఆర్‌సీపై తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై ఆయన తక్షణమే స్పందించాలి.
– గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ రోడ్డెక్కాయి. కూటమి పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్కరి నోట విన్నా నిరసన గళాలే వినిపిస్తున్నాయి. ఉద్యోగుల అన్ని సమస్యలనూ పరిష్కరిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదనే ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ఒక్క ఉద్యోగీ కానరావడం లేదు. ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోతున్నాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులను తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే ఉద్యోగులు తమ సమస్యలే పరిష్కారం కావడం లేదని ప్రజల వద్ద వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చవి చూడలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు తగినంతగా యూరియా సరఫరా చేయడం లేదని రైతులు రోడ్లెక్కారు. పీఆర్‌సీ, డీఏ బకాయిల కోసం టీచర్లు రోడ్లెక్కారు. దీర్ఘకాలిక సమస్యల సాధనకు విద్యుత్ ఉద్యోగులు రోడ్లెక్కారు. ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకోనివ్వాలని సచివాలయ ఉద్యోగులు రోడ్లెక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్‌జీఓలు రోడ్డెక్కుతామని ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యానికి ఇంతకన్నా ఇంకేమి నిదర్శనం కావాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ వంటి రుణాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది.
పెరుగుతున్న ఉద్యోగుల నిరసనలు
ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమాలు ఊపందుకున్నాయి. రణభేరి పేరుతో యూటీఎఫ్ ఉద్యమానికి దిగింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఈ నెల 25న విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రణభేరీ జాతా పేరుతో జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఏపీటీఎఫ్ సైతం వివిధ రూపాల్లో ఉద్యమాలు సాగిస్తోంది. ఈ నెల 11న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. 12న మండల కేంద్రాల్లో నిరసనలు, 13, 14 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతులు ఇచ్చారు. 15న డివిజన్ కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రంలో నిరసనలు తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు
విధులకు సంబంధం లేని సర్వేలు, ఇతర పనుల నుంచి విముక్తి కలిగించాలి. శాఖల వారీగా మాతృశాఖలో విలీనం చేయాలి. సచివాలయాల్లోని అన్ని విభాగాల ఉద్యోగులకు ఒకే బేసిక్‌తో పదోన్నతి కల్పిస్తూ పీఆర్సీ శ్లాబ్ వర్తింపజేయాలి. సెలవు రోజుల్లో బలవంతపు విధుల నుంచి విముక్తి కలిగించాలి. రికార్డు అసిస్టెంట్ కేడర్‌ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌గా అప్‌గ్రేడ్ చేయాలి. ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
రోజురోజుకూ పెరుగుతున్న నిరసనలు
రణభేరి పేరుతో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
కనీసం స్పందించని కూటమి ప్రభుత్వం
ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఇవ్వడానికీ నిధుల కొరత
విద్యుత్ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అత్యవసర సేవలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకూ శాంతియుతంగా యాజమాన్యాలకు పలుసార్లు వినతిపత్రాలు సమర్పించడం, విద్యుత్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయడం వరకే మా పోరు కొనసాగించాం. అయినప్పటికీ యాజమాన్యాల మొండి వైఖరి విడనాడకపోవడంతో రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఎదురైంది.
– తురగా రామకృష్ణ, ఈపీడీసీఎల్ డిస్కం కో– చైర్మన్
సచివాలయ ఉద్యోగులదీ అదే బాట
దాదాపు ఏడాదిన్నరగా ఎన్నో వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చిన సచివాలయ ఉద్యోగుల్లో చివరకు సహనం నశించింది. ఈ నేపథ్యంలో తమ ఆత్మగౌరవాన్ని వదులుకోలేక తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇంటింటికీ వెళ్లి వాట్సప్ సేవలపై ప్రచారం చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని, తమ సమస్యలు పరిష్కరించక పోతే అక్టోబర్ 1 నుంచి పింఛన్ల పంపిణీ ఆపేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విద్యుత్ ఉద్యోగుల దశల వారీ ఆందోళన
తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖలోని అన్ని యూనియన్లు ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ నెల 15, 16వ తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 17, 18 తేదీల్లో భోజన విరామ సమయాల్లో ఆందోళనలు చేపట్టారు. 19, 20 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేశారు. సోమవారం భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

రోడ్డెక్కిన ఉద్యోగులు

రోడ్డెక్కిన ఉద్యోగులు

రోడ్డెక్కిన ఉద్యోగులు