
అర్జీలకు పరిష్కారం చూపాలి
ఏలూరు(మెట్రో): కలెక్టరేటు సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ ఫిర్యాదుదారులను ఆప్యాయతతో పలకరించి సమస్యలను పూర్తిగా విని పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. వచ్చిన ప్రతి అర్జీని ఒక చాలెంజ్‌గా తీసుకుని పరిష్కారం చేస్తే జూనియర్ అధికారులకు మంచి స్పూర్తి కలుగుతుందన్నారు. అర్జీలు రీ ఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడు అర్జీదారులు సంతృప్తి చెందుతారని అలాంటి పరిష్కారాలను విజయగాథలుగా జిల్లా కార్యాలయానికి పంపించాలని, పీజీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం, గౌరవం కలుగుతుందన్నారు.
టి.నరసాపురం: మండలంలో కురిసిన భారీ వర్షానికి ముగ్గురాళ్ళ వాగు, జలవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటీవల భారీ వర్షాలతో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని బండివారిగూడెం–మక్కినవారిగూడెం, టి.నరసాపురం – మక్కినవారిగూడెం గ్రామాల మధ్య రెండు రోజుల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతో ముగ్గురాళ్ళవాగు, జలవాగులు వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు, పోలీసు సిబ్బంది వాగును పరిశీలించి రోడ్ల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేశారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ–2025లో నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ ఈ నెల 25న అమరావతిలో నియామకపు లేఖ అందిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ నెల 24న సాయంత్రం 4 గంటలకు ఏలూరులో నిర్వహించే వెన్యూకి వచ్చి రిపోర్ట్ చేయాలని, అక్కడి నుంచి 25న ఉదయం 8 గంటలకు బస్సు ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు నేరుగా అమరావతిలో జరిగే కార్యక్రమ ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమరావతిలో నియామక లేఖ అందచేస్తారన్నారు.
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను రిష్కరించాలని, తమ కోర్కెలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలని ఏపీఈపీడీసీఎల్ డిస్కం కో–చైర్మన్ తురగా రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం విద్యుత్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ న్యాయమైన కోర్కెలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని, ఒప్పుకున్న డిమాండ్స్‌ను ఆర్డర్స్ రూపంలో ఇవ్వకుండా తాత్సారం చేస్తుందని, తప్పని పరిస్థితుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కారుణ్య నియామకాలు కల్పించడంలో కొత్త పేర్లు పెట్టి కన్సాలిడేట్‌డ్ పే ఇస్తున్న పద్ధతిని వెంటనే రద్దు చేసి గత నాలుగు దశాబ్దాల నుంచి అమలు పద్దతినే కొనసాగించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తప్పనిసరి అయితే నిరవధిక సమ్మె చేపడుతామని తెలిపారు.

అర్జీలకు పరిష్కారం చూపాలి