
వీఆర్‌ఏల గోడు పట్టదా?
హామీ అమలు చేయాలి
పనికి తగ్గ జీతం ఎక్కడ?
● పని భారం ఎక్కువ.. జీతాలు తక్కువ
● నేడు కలెక్టర్ కార్యాలయాల వద్ద వీఆర్‌ఏల ధర్నా
● జీతాలు పెంచాలని వేడుకోలు
కై కలూరు: కష్టానికి తగిన ప్రతిఫలం గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)కు దక్కడం లేదు. పెరిగిన జీవన ప్రమాణాలు, నిత్యావసర ధరలతో చాలీచాలని జీతాలు సరిపోక బతుకుబండి లాగుతున్నారు. సర్వీసు రూల్స్ ప్రకారం పార్ట్ టైం ఉద్యోగులుగా పేర్కొన్నప్పటికీ పగలు, రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చదివిన వీఆర్‌ఏలకు పదోన్నతి లేక కుమిలిపోతున్నారు. పనిభారంపై ఎదిరించి అడిగితే విధుల నుంచి తొలగిస్తారనే భయం అందరిలోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు సిద్దమయ్యారు.
ఏలూరు జిల్లాలో 992 మంది వీఆర్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారు. నానాటికీ పనిభారం పెరగడం, తక్కువ జీతాలతో కుటుంబం గడవకపోవడంతో వీఆర్‌ఏలు ఆందోళనబాటు పట్టారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18, 19 తేదీల్లో మండల తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతిపత్రం అందించడం, 20న ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నా, విజ్ఞాపన పత్రం అందించడం వంటి కార్యక్రమాలు చేశారు. చివరిగా 22న ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు.
పదోన్నతుల కోసం పడిగాపులు
గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రారంభంలో రూ.3000 జీతం ఉండేది. తర్వాత రూ.6,000, చివరిగా రూ.10,500కి చేరింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పదో తరగతి చదివిన వీఆర్‌ఏలకు కండిషన్ ప్రకారం రెండేళ్ళలో ఇంటర్ పూర్తి చేయాలనే షరతుతో వీఆర్‌వోలుగా రాష్ట్రంలో దాదాపు 7000 మందికి పదోన్నతులు కల్పించారు. 2012, 20214లో రెండు పర్యాయాలు వీఆర్‌ఏలకు నోటిఫికేన్ ద్వారా ఉద్యోగాలు కల్పించారు. అప్పటి నుంచి వీఆర్‌ఏల నోటిఫికేషన్ జరగలేదు. 2014 ముందు పనిచేసిన వీఆర్‌ఏలకు పదవీ విరమణ లేదు. దీంతో వారసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేదు. జీవో నంబరు 104తో వీఆర్‌వోల నియామకాలకు డిగ్రీ ఉత్తీర్ణత తీసుకొచ్చారు. డైరెక్టు నియామకాల కారణంగా అర్హత ఉన్నప్పటికీ 10 నుంచి 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వీఆర్‌ఏలు పదోన్నతులకు దూరమవుతున్నారు.
చాలీచాలని జీతాలతో కష్టాలు
జిల్లాలోని అనేక మండల కేంద్రాలకు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నా వీఆర్‌ఏలను వివిధ పనులకు పిలుస్తున్నారు. రవాణా ఖర్చులను వీఆర్‌ఏలే భరించాల్సి వస్తోంది. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని జిల్లా కేంద్రాల్లో సైతం వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో వీఆర్‌వోల కొరత ఉందని అర్హత కలిగిన వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించాలని ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. పే స్కేలు అమలు, నామినీలను వీఆర్‌ఏలుగా నియమించడం, అర్హులకు పదోన్నతులు, కారణ్య నియామకాలను కోరుతున్నారు. న్యాయమైన కోర్కెలు తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వీఆర్‌ఏలు వాపోయారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. నిత్యావసరాల ధరలు పెరగడంతో రూ.10,500 జీతంలో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతోంది. డిగ్రీ, పీజీలు చేసిన వీఆర్‌ఏలు పదోన్నతులు లేక మగ్గిపోతున్నాం. వీఆర్‌ఏలకు పదోన్నతులలో 70 శాతం రేషియో కేటాయించాలి.
– బలే రాజశేఖర్, వీఆర్‌ఏ సంఘ అధ్యక్షుడు, కై కలూరు మండలం
పేరుకే పార్టు టైం ఉద్యోగం. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహిస్తున్నాం. మండల కేంద్రాలలో సైతం వివిధ రెవెన్యూ కార్యక్రమాల్లో సేవలు అందిస్తున్నాం. చాలీచాలనీ జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. వీఆర్‌ఏలుగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన అందరికీ అర్హత ప్రకారం పదోన్నతులు కల్పించి, జీతాలు పెంచాలి.
– అనిత, భుజబలపట్నం వీఆర్‌ఏ

వీఆర్‌ఏల గోడు పట్టదా?

వీఆర్‌ఏల గోడు పట్టదా?

వీఆర్‌ఏల గోడు పట్టదా?