● 6న స్వామివారి తిరుకల్యాణం
● 7న రథోత్సవం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 నుంచి 9 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వాటిని పురస్కరించుకుని ఉత్సవాల ఆహ్వాన పత్రికలను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి వారి క్యాంపు కార్యాలయాల్లో ఆదివారం అందజేశారు. మిగిలిన ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు అందించనున్నారు. ఇదిలా ఉంటే ఉత్సవ విశేషాలను ఈఓ మూర్తి విలేకర్లకు వెల్లడించారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 8 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను కనులపండువగా జరుపుతామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి 9 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. యావన్మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారిని దర్శించి తరించాలని కోరారు.
ఉత్సవాలు జరిగేదిలా..
● వచ్చేనెల 2న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం.
● 3న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం.
● 4న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం.
● 5న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవం.
● 6న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం.
● 7న రాత్రి 8 గంటల నుంచి రథోత్సవం.
● 8న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణ, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవం.
● 9న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం