
అకాల వర్షంతో తడిసిన ధాన్యం
తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారంలో తడిసిన ధాన్యం బస్తాలు ఎల్.అగ్రహారంలో ఈదురు గాలులకు నేలకొరిగిన వరి
తాడేపల్లిగూడెం రూరల్: అకాల వర్షంతో మండలంలో పలు గ్రామాల్లోని ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా ఎల్.అగ్రహారం ఆర్‌ఎస్‌కే వద్ద నెట్టు కట్టిన ధాన్యం బస్తాలు, రాశులుగా పోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉండటంతో రైతు ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కించి, నెట్టుగా వేశారు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం బస్తాలు తడిసి తీరని ఆవేదన మిగిల్చింది. ఏటా ఖరీఫ్ సీజన్‌లో పండించిన పంట గట్టెక్కించుకునే క్రమంలో అకాల వర్షాలు రైతుపై కన్నెర్ర చేయడం పరిపాటిగా వస్తోంది. ఇటుకులగుంట, కుంచనపల్లి సబ్ స్టేషన్ సమీపంలోని వరి చేలు ఈదురు గాలుల ప్రభావానికి నేలకొరిగాయి. మరోవైపు మోదుగగుంట, అప్పారావుపేట, దండగర్ర, మాధవరం తదితర గ్రామాల్లో వర్షం జాడ లేదు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల రైతాంగం ఊపిరి పీల్చుకున్నారు. గత రెండ్రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం వర్షంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతుఉన్నారు. శనివారం 75 కిలోల బస్తా ధాన్యం రూ.1200కి విక్రయించగా, ఆదివారం పది రూపాయలు తగ్గించి రూ.1190కు కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. ఒక్క రోజులోనే బస్తాపై రూ.10 తగ్గించి కమిషన్ వ్యాపారులు కొనుగోలు చేశారు. కడియద్ద గ్రామంలో ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన క్రమంలో త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అయితే, నేటికీ ఆచరణ సాధ్యం కాకపోవడంతో కమిషన్‌దారులు రైతుల నుంచి అయిన కాడికి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.

అకాల వర్షంతో తడిసిన ధాన్యం