
పాము కాటుకు ఇద్దరు మహిళల మృతి
పాలకొల్లు సెంట్రల్: వేర్వేరు ప్రాంతాల్లో పాము కాటుకు ఇద్దరు మహిళలు బలయ్యారు. పాలకొల్లు మండలంలోని వెలివల గ్రామానికి చెందిన కేతా దేవి (30)శనివారం ఓ తోటలో కలుపు మొక్కలు తీయడానికి వెళ్లింది. అక్కడ పాము కాటుకు గురికాగా స్థానికులు వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం దేవి మృతి చెందింది. ఆమెకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భర్త కేవీ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
కూలి పనికి వెళ్లి..
చాట్రాయి: మండలంలోని చిన్నంపేట గ్రామానికి చెందిన తేళ్లూరి జెసింత(45)ఆదివారం ఉదయం కూరగాయల తోటలో కూలి పని చేస్తుండగా పాము కాటుకు గురైంది. ఆమెను చాట్రాయి పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందించగా అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మృతి చెందిందని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. జెసింతకు భర్త, కుమారుడు ఉన్నారు. కాగా చాట్రాయి పీహెచ్‌సీలో సకాలంలో వైద్యం అందించకపోవడం వలనే జెసింత మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.
ఏలూరు టౌన్, దెందులూరు: ఏలూరు ఆర్‌టీవో కార్యాలయం సమీపంలోని ఉండవల్లి అపార్ట్‌మెంట్‌లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవల్లి అపార్ట్‌మెంట్స్‌లో ఆశ్రం ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ కే.శైలజ నివాసం ఉంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 17న దైవదర్శనం కోసం షిర్డీ వెళ్లారు. తిరిగి 21వ తేదీ ఆదివారం ఇంటికి తిరిగివచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా ఇంటిలోని రూ.లక్ష నగదు అపహరణకు గురైందని గుర్తించారు. సమాచారం అందుకున్న ఏలూరు వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ఏలూరు రూరల్ ఎస్సై జీ.నాగబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు తెలిపారు.
చాట్రాయి: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని పర్వతాపురం గ్రామానికి చెందిన చొప్పరపు రాజేష్ (29) ఈ నెల14న భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెంలో కొబ్బరికాయల దింపు పని నిమిత్తం వెళ్లాడు. చెట్టుపైకి ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడి తీవ్ర గాయాల య్యాయి. వెంటనే అతడిని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ముదినేపల్లి రూరల్: అధిక కట్నం తీసుకురమ్మంటూ వేధిస్తున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముదినేపల్లికి చెందిన షేక్ ఫర్జనాకు ఉయ్యూరు మండలం కాటూరుకు చెందిన కార్తీక్‌తో నాలుగేళ్ల కిందట పరిచయం కాగా పెద్దల అంగీకారం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా కార్తీక్ భార్యను తరచూ కట్నం తీసుకురాలేదంటూ మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో రెండేళ్ల కిందట ఫర్జనా ముదినేపల్లి వచ్చి నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కార్తీక్ ముదినేపల్లి వచ్చి తనను కొట్టడంతో పాటు దూషించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పాము కాటుకు ఇద్దరు మహిళల మృతి