
దంచి కొట్టిన వాన
భీమడోలు: భీమడోలు మండలవ్యాప్తంగా శనివారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. ఏకధాటిగా రెండు గంటలకు పైగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. భీమడోలు, గుండుగొలను, పూళ్ల, సూరప్పగూడెం తదితర గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పాఠశాలల ప్రాంగణాలు నీటిమునిగాయి. భీమడోలు జంక్షన్‌లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటితో రోడ్డు మునగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రెయిన్లు పొంగి రోడ్లపై ప్రవహించాయి. భీమడోలు జంక్షన్ నుంచి సంతమార్కెట్ వరకు ఆర్‌అండ్‌బీ రహదారి భారీ గోతుల్లో వర్షం నీరు నిలవడంతో ఇటుగా ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. భారీ వర్షంతో పాటు పిడుగులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
గణపవరంలో..
గణపవరం: గణపవరం పరిసర ప్రాంతంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో భారీ వర్షం పడింది. గంటకు పైగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గణపవరం–ఏలూరు రోడ్డుపై అడుగు లోతు మేర నీరు చేరింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసంది. గణపవరం–భీమవరం, గణపవరం–తాడేపల్లిగూడెం, గణపవరం–ఆ కివీడు రోడ్లపై గుంతల్లో వర్షం నీరు చేరడంతో రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.

దంచి కొట్టిన వాన

దంచి కొట్టిన వాన