
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే
భీమడోలు: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆశావర్కర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోచమ్మ అన్నారు. స్థానిక కల్యాణ మండపంలో శనివారం ఆశావర్కర్ల సంఘ జిల్లా ఐదో మహాసభ నిర్వహించారు. సీఐటీయూ జెండాను సీనియర్ కార్యకర్త షేక్ షకీలా ఎగురువేశారు. అనంతరం జరిగిన సభకు జిల్లా అధ్యక్షురాలు కె.కమల ధనలక్ష్మి అధ్యక్షత వహించారు. ఆశావర్కర్లకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా పోచమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశావర్కర్లతో సంబంధం లేని పనులు చేయిస్తూ పనిభారం పెంచుతోందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, జిల్లా కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌ఏడీ ప్రసాద్ మాల్లాడుతూ ఆశాల పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్ల సంఘ జిల్లా ఉపాధ్యక్షురాలు జె.విమల, వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు నాగలక్ష్మి, రైతు సంఘం జిల్లా అధ్యక్షురాలు కట్టా భాస్కరరావు, మండల కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.