
ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు, ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజల కోరికను నెరవేర్చుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారన్నారు. 2023 సెప్టెంబర్ 15న ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రెండేళ్ల వైద్య విద్య పూర్తి కావటం సంతోషంగా ఉందన్నారు. అయితే సీఎం చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుందనీ, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవటం ఏమిటని ప్రశ్నించారు.
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటుపరం చేస్తానంటే ఊరుకునేది లేదన్నారు. తమ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే వైఖరిని స్పష్టం చేశారని, అవసరమైతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను గమనిస్తున్నారన్నారు.
పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు అన్నారు. పేదలకు ఆధునిక వైద్యం, విద్యను దూరం చేయాలని చూస్తున్నారన్నారు. కనీసం ఎరువులు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు కష్టాల్లోనే ఉన్నారని, ప్రజలను నట్టేట ముంచటమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని విమర్శించారు.