
యూరియాను అందించలేని దుస్థితిలో కూటమి
నూజివీడు: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, యూ రియాను సరఫరా చేయలేని దుస్థితిలో సర్కారు ఉందని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో ఈనెల 9న నిర్వహిస్తున్న రైతు నిరసనపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మా ట్లాడుతూ కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతుంది గాని, రైతులకు యూరియా దొరకడం లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసా యం పండుగలా సాగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మామిడి, మిర్చి, మొక్కజొన్న, మినుము, పొగాకు, పుచ్చ ఇలా పలు పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారని, సొసైటీలకు వారానికోసారి కేవలం 12 టన్నులు మాత్రమే ఇస్తున్నారని, ఇది ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి సరిపడా యూరియాను ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ పాలన యూరియా కొరత తలెత్తలేదన్నారు. మద్యం షాపులు, బార్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతు సంక్షేమంపై లేదన్నారు. మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. చిత్తూరు ప్రాంతంలో మామిడి రైతులకు కంటితుడుపుగా ఇచ్చిన బోనస్‌ను నూజివీడు ప్రాంతంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న యూరియా సమస్యపై రైతులతో కలిసి స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు, ఆగిరిపల్లి జెడ్పీటీసీలు వరికూటి ప్రతాప్, పిన్నిబోయిన వీరబాబు, ఆగిరిపల్లి ఎంపీపీ గోళ్ల అనూష, ముసునూరు, చాట్రాయి మండలాల పార్టీ అధ్యక్షులు మూల్పురి నాగవల్లేశ్వరరావు, పుచ్ఛకాయల సుబ్బారెడ్డి, సీనియర్ నాయకలు పలగాని నరసింహారావు, ఈలప్రోలు సుబ్బయ్య, మచ్చా హరిబాబు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు