
కృత్రిమ కొరతతోనే యూరియా సంక్షోభం
కొయ్యలగూడెం: యూరియా సంక్షోభానికి కృత్రిమ కొరతే కారణమని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శుక్రవారం కొయ్యలగూడెంలో వైఎస్సార్‌సీపీ యూత్ నేత నూకల రాము ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 9న చేపట్టనున్న ఆర్డీఓ కార్యాలయాల ముట్టడి, ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు యూరియాను బ్లాక్ మార్కె ట్‌కి తరలించి కోట్లాది రూపాయల స్కామ్‌కి తెరదీశారని ఆరోపించారు. కొందరు ప్రజాప్రతినిధులు, నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారిన కూటమి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. చంద్రబాబు అంటేనే కరువు, కాటకాలకు దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు సొసైటీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం తమ పార్టీలకు చెందిన వారికి మాత్రమే సుపరిపాలన అందిస్తూ ప్రజలను నట్టేట ముంచేస్తోందన్నారు. పార్టీ మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, ఎంపీపీ గంజిమాల రామారావు, మండల కో–కన్వీనర్ బిరుదుగట్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
బొజ్జగణపయ్యా.. యూరియా అందించవయ్యా
గణేష్ సెంటర్‌లో పునర్నిర్మించిన వినాయక ఆలయంలో బాలరాజు పూజలు చేశారు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు తీర్చాలని కోరారు.