
కోకో రైతులు సంఘటితం కావాలి
పెదవేగి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోకో రైతులు సంఘటితం కావాలని రైతు నాయకులు పిలుపునిచ్చారు. గురువారం విజయరాయిలోని సీతారామ కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ) ఆధ్వర్యంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏబీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా రైతులను మోసగిస్తున్నాయని విమర్శించారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరైన మార్కెటింగ్ విధానంలో కోకో గింజలను అమ్ముకోగలిగితే రైతులకు లాభాలు వస్తాయని సీపీసీఆర్‌ఐ కాసర గోడ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప అన్నారు. నాబార్డ్ ఏజీఎం ఎం.రాజశేఖర్ రెడ్డి మా ట్లాడుతూ కోకో రైతుల ఎఫ్‌పీఓకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఉద్యాన శాఖ జేడీ మునిరెడ్డి, ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఎస్.రామ్మోహన్, కొబ్బరి రైతుల ప్రాంతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, పెదవేగి ఆయిల్‌పామ్ రైతుల సంఘం అధ్యక్షుడు ఉండవల్లి వెంకటరావు, సంఘ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్‌బాబు పాల్గొన్నారు.