
దళితులపై దాడులు దారుణం
ఏలూరు (టూటౌన్): కై కలూరు మండలంలో దానగూడెంలో దళితులపై జరిగిన దాడులను వివిధ సంఘాలు, పలు పార్టీల నాయకులు ఖండించారు. బాధితులను పరామర్శించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ విమర్శించారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై దాడులకు తెగబడటం సరికాదన్నారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. సమావేశంలో గొల్ల కిరణ్, కనికెళ్ల రవిప్రసాద్, పెరియార్ పాల్గొన్నారు.
తక్షణమే అరెస్టు చేయాలి
దళితులపై హత్యాయత్నం చేసిన దోషులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని దళిత బహుజన్ సీనియర్ నాయకుడు నేతల రమేష్ బాబు డిమాండ్‌చేశారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను ఆయన పరామర్శించారు. దళితులపై హత్యాయత్నానికి పాల్పడిన జనసేన నాయకులను ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ యాక్టు కింద తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. కై కలూరులో జరిగిన దాడిని పోలీసులు ఇరువర్గాల ఘర్షణగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
దళితులపై దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన బాధితులను శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ.ఫ్రాన్సిస్ డిమాండ్‌చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువకులను ఆయన శనివారం పరామర్శించారు. గతంలో జనసేన సైనికులు పిఠాపురంలో దళితుల ఊరు మీద పడి దారుణంగా కొట్టారని, ఇప్పుడు కై కలూరులో అలాగే దాడులకు పాల్పడినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
విచారణ జరిపించాలి
కై కలూరు మండలం దానగూడెం దళితులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. దోషులపై అట్రాసిటీ చట్టం పెట్టి అరెస్టు చేయాలని సీపీఎం జిల్లాకార్యదర్శి ఏ.రవి డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే హత్యలు, అత్యాచారాలు, దాడులను అరికడతామని చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు.
బాధితులను పరామర్శించిన సంఘాలు, పార్టీల నాయకులు

దళితులపై దాడులు దారుణం