
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
నరసాపురం రూరల్: గంజాయి కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.40 వేలు ఖరీదు చేసే 1.938 కిలోల (సుమారు రెండు కిలోలు) గంజాయి, మూడు సెల్‌ఫోన్‌లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై నరసాపురం ఎస్సై సీహెచ్ జయలక్ష్మికి వచ్చిన సమాచారం మేరకు నరసాపురం– పాలకొల్లు రోడ్డులోని వీరభవాని ఆలయం వెనుక గల ఖాళీ స్థలంలో పోలీసులు నిఘా వేశారు. ఉండి ఎన్‌ఆర్‌పీ అగ్రహారంనకు చెందిన కాలుకురస ఏసురాజు నరసాపురం వీవర్స్ కాలనీకి చెందిన పృధ్వీసాయి శివకుమార్, పిచ్చుక ఉదయ్‌కిరణ్‌లకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపగా రిమాండ్ విధించినట్లు చెప్పారు. ఏసురాజు ఏలూరుకు చెందిన మణికంఠ వద్ద గజాయిని కొని నరసాపురానికి చెందిన వ్యక్తులకు విక్రయిస్తున్నాడని, మణికంఠను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నరసాపురం డీఎస్పీ శ్రీవేద ఆదేశాల మేరకు టౌన్ సీఐ బి యాదగిరి ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో ఎస్సై ముత్యాలరావు, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాలరావు, ప్రకాష్ బాబు, కానిస్టేబుల్ చక్రవర్తి పాల్గొన్నారు.