
బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు
భీమవరం : భీమవరంలోని బీవీరాజు కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగంలో జాతీయస్థాయి గుర్తింపు దక్కించుకుందని ప్రిన్సిపాల్ ఐఆర్ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ ఈ నెల 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈ ఘనత సాధించిందని చెప్పారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ కేవీ స్వామి అభినందనలు తెలియజేస్తూ సర్టిఫికెట్ అందించారని వివరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బందిని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవీ విష్ణురాజు, వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్, సెక్రటరీ కె.ఆదిత్య విస్సం, జాయింట్ సెక్రటరీ కె.సాయి సుమంత్, డైరెక్టర్లు తదితరులు అభినందించారు.
గర్భం దాల్చిన మైనర్ బాలిక
ఏలూరు టౌన్: మైనర్ బాలికకు ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమె గర్భవతిని చేశాడు. బాలికకు అనారోగ్య సమస్య రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ లంకగ్రామానికి చెందిన భార్యభర్త కొంతకాలం క్రితం గ్రామం నుంచి వలస వెళ్లి మహారాష్ట్రలోని పూణేలో చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మైనర్ బాలిక మాత్రం లంకగ్రామంలోనే తన అమ్మమ్మ వద్ద ఉంటూ 8వ తరగతి వరకూ చదివి ఇంటివద్దనే ఉంటుంది. 2024లో బాలికను తల్లిదండ్రులు తమతోపాటు పూణే తీసుకువెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బాలికకు పరిచయం అయ్యాడు. ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులమని పరిచయం చేసుకుని, బాలికతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇటీవల బాలిక తన అమ్మమ్మ వద్దకు వచ్చింది. బాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా ఆమెను పరీక్షించిన వైద్యులు 9నెలల గర్భవతిగా నిర్థారించారు. ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు జీజీహెచ్‌లో చేర్పించారు.
ముసునూరు: ఇంటి సమీపంలో ఉన్న నేల బావిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఎం.చిరంజీవి తెలిపిన వివరాలివి. వేల్పుచర్ల శివారు అన్నపనేనివారిగూడెంకు చెందిన ఉమ్మడి వెంకట నాగకిషోర్ (32) శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి వెనుక గల నేల బావిలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ముసునూరు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక సిబ్బందిని రప్పించి, మృతదేహాన్ని బావిలోనుంచి బయటకు తీయించారు. నాగకిషోర్‌కు భార్య, 10 నెలల కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో లంపి స్కిన్ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్నందు వల్ల భక్తుల నుంచి గోదానాన్ని, అలాగే భక్తులకు ఇచ్చే గోదత్తతను శ్రీవారి దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అంటు వ్యాధులు తగ్గిన తరువాత మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తామని, భక్తులకు ఆ విషయాన్ని తెలియజేస్తామని చెప్పారు.

బీవీ రాజు కళాశాలకు జాతీయస్థాయి గుర్తింపు