
బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులం
సాక్షి, భీమవరం: మేము బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇంటింటి సర్వేలు నిషేధించాలంటూ శుక్రవారం నిర్వహించాల్సిన వాట్సప్ గవర్నెన్స్ ఇంటింట అవగాహన సర్వేను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సచివాలయాలకు గాను కేవలం 12 సచివాలయాల్లో మాత్రమే సర్వే చేసినట్టుగా డాష్‌బోర్డులో అప్‌లోడ్ చేయగా.. జేఏసీ పిలుపు మేరకు మిగిలిన ఉద్యోగులు సర్వేను బహిష్కరించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం వ్యయప్రయాసలకోర్చి ప్రజలు మండల, జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన పనిలేకుండా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేలు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల జనాభా ప్రాతిపదికన జిల్లాలో 535 సచివాలయాల పరిధిలో ప్రస్తుతం 4,434 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరిలో సచివాలయ సెక్రటరీ, ఇంజినీరింగ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎం, విలేజ్ సర్వేయర్ తదితర ఉద్యోగులు ఉన్నారు. సచివాలయానికి వెళితే చాలు అన్ని పనులు జరిగేలా 500కు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆయా సేవలను బట్టి తక్షణ, కొన్ని 72 గంటలు, మరికొన్ని వారం నుంచి రెండు వారాల వ్యవధిలో పరిష్కరించేలా గడువు పెట్టారు. గత ప్రభుత్వంలో కేవలం దరఖాస్తు చేసుకున్న గంటలోనే రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరుచేసిన సచివాలయాలు ఎన్నో ఉన్నాయి.
కూటమి కుట్రలు
గతంలో నవరత్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరి గడప చెంతకు చేరేలా వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ సచివాలయ ఉద్యోగులు పనిచేసేవారు. కాగా సంక్షేమాన్ని అటకెక్కించిన కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో జాబ్‌చార్ట్‌లో లేని పనులు చేయిస్తూ వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వలంటీర్ల పనులను వారితో చేయిస్తూ మొత్తం పనిభారం ఉద్యోగులపై మోపింది. హౌస్‌హోల్డ్, ఎంఎస్‌ఎం తదితర సర్వేల పేరిట ఇంటింటికి తిప్పుతూ వెట్టిచాకిరీ చేయిస్తోంది. కూటమి వచ్చాక కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సొంత సర్వేలకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. హేతుబద్దీకరణ పేరిట 3,500 జనాభా పైబడిన సచివాలయాల్లో ఎనిమిది మంది, 2,500 నుంచి 3,500 జనాభా ఉన్న చోట ఏడుగురు, 2,500 లోపు జనాభా ఉన్నచోట ఆరుగురు ఉద్యోగులను కొనసాగించే అంశాన్ని కూటమి తెరపైకి తెచ్చింది. మరోపక్క ఉద్యోగుల బదిలీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు లెటర్లకు ప్రాధాన్యమిస్తూ రాజకీయ జోక్యానికి తెరలేపింది. తాజాగా ప్రతి శుక్రవారం వాట్సప్ గవర్నెస్ అవగాహన సర్వేలు నిర్వహించాలంటూ గురువారం సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలందాయి. ఈ విషయమై సచివాలయ ఉద్యోగుల జేఏసీ స్పందించింది. ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే వలంటీర్ విధులను బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం భీమవరం, ఆకివీడు, జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు వాట్సప్ సర్వీస్ రిజిస్ట్రేషన్లను ఉద్యోగులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దీంతో జిల్లాలో 535 సచివాలయాల పరిధిలో ఒక్కచోట కూడా వాట్సప్ రిజిస్ట్రేషన్లు జరుగలేదు.
సచివాలయ ఉద్యోగుల పోరుబాట
సర్వే డాష్‌బోర్డు నింపకుండా నిరసన
ఇంటింటి సర్వేలు నిషేధించాలని డిమాండ్
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు

బానిసలం కాదు.. ప్రభుత్వ ఉద్యోగులం