ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ విమర్శించారు. గురువారం ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా 70 వేల ఎకరాలు తీసుకుందని మండిపడ్డారు. రైతుల భూములతో, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, ఒకాయన బయట రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకు ఫోన్లు చేస్తూ మీకు 100 ఎకరాలు ఇస్తాం.. మాకేం ఇస్తారు అని అడుగుతున్నారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని, రైతులను దగా చేశారని, ఒక రైతు 90 ఎకరాలు ఇచ్చాడని, ఎందుకిచ్చావయ్యా అని అడిగితే, మా ఖర్మకొద్దీ ఇచ్చామని బాధతో వాపోయాడని తెలిపారు.
అభివృద్ధి కుంటుపడింది
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని చింతా మోహన్ అన్నారు. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని, వీధిలైట్లు, రోడ్లు వేసుకునేందుకు డబ్బులేక, సర్పంచ్‌లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. లిక్కర్ అమ్మకాల వల్ల కుటుంబాల్లో విభేదాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందా, ఈ చర్యతో ఓబీసీలకు పెద్దపీట వేసినట్టేనా అని చింతా మోహన్ ప్రశ్నించారు.
ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శలు