మధ్యాహ్నం.. అందని వైద్యం | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం.. అందని వైద్యం

Aug 7 2025 8:06 AM | Updated on Aug 7 2025 9:14 AM

మధ్యా

మధ్యాహ్నం.. అందని వైద్యం

ప్రైవేటుయాజమాన్యాలే టార్గెట్‌..?

సర్కారు దవాఖానాలకు వచ్చే పేదలకు వైద్యసేవలు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల కేవలం ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌లు మాత్రమే తనిఖీలు చేయడం వెనుక గూడార్ధం ఏంటా అనేది వైద్యవర్గాల్లోను చర్చనీయాంశమైంది. తరచూ వైద్యశాఖ ఉన్నతాధికారులు కేవలం ప్రైవేటు యాజమాన్యాలనే కలుస్తుండడంపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టరేట్‌ ఆప్‌ సెకండరీ హెల్త్‌కు సంబంధించి ఉన్నతాధికారులు సంబంధిత ఆస్పత్రుల్లో ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో కొందరు వైద్యులు తమ ఇస్టానుసారంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమస్యలపై డీఎంహెచ్‌వో డాక్టర్‌ గీతాబాయిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిందేనని, కొందరు వైద్యులు అదనంగా మరికొన్ని ఆస్పత్రుల్లో ఇన్‌చార్జులుగా ఉంటున్నారని, వైద్యుల తీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తానని చెప్పారు.

తణుకు అర్బన్‌ : గత ఐదేళ్లపాటు పేదలపాలిట సంజీవనిలా సత్వర వైద్యసేవలందించిన ఆస్పత్రులు నేడు వేళకు రాని వైద్యులతోపాటు, ఆస్పత్రిలో కాలు నిలవక బయటకు వెళ్లే వైద్యుల కారణంగా పేదలకు వైద్యసేవలు కునారిల్లుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో ఉండాల్సిన వైద్యులు నేడు విధులకు ఆలస్యంగా కొందరు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్‌ కోసం వెళ్లే వారు కొందరు, మధ్యాహ్నం పూర్తిగా ఇంటికో, ప్రైవేటు ఆస్పత్రులకో పరిమితమయ్యే మరి కొందరు వైద్యుల కారణంగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యసేవలు అందడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ తరహా పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ విభాగాల్లో వైద్యులు 80 శాతం మంది ఒంటిపూట వైద్యానికి అలవాటుపడ్డారని వైద్య సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి క్యారేజీలు పట్టుకుని వచ్చే వైద్యులు మాత్రమే పూర్తిస్థాయిలో ఆస్పత్రిని అంటిపెట్టుకుని ఉంటుండగా, భోజనానికి ఇంటికెళ్లి వచ్చే వైద్యులు చాలా మంది తిరిగి ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసేందుకు మాత్రమే వస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వైద్యులైతే ఉదయం పూట కూడా ప్రైవేటు వైద్యానికి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని రోగులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణాల్లో కూడా పేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు సైతం దూర ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లే అవసరం లేకుండానే సమీపంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో వైద్యసేవలు పొందుతున్నారు.

దూరమైన సత్వర వైద్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఆస్పత్రుల్లో ఉండి రోగులకు సత్వర వైద్యం అందించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ తరహా సేవలు అందడంలేదని రోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉదయం ఏదోలా వైద్యం అందుతున్నా ఇక మధ్యాహ్నం 1 గంట తరువాత జిల్లా వ్యాప్తంగా వైద్యులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండడంలేదనేది వాస్తవమని రోగులు స్వయంగా చెబుతున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లకు వచ్చే రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం వచ్చిన రోగులను మరుసటి రోజు రావాలని, ఇబ్బంది ఎక్కువగా ఉంటే వైద్యులకు ఫోన్‌ చేస్తామని అప్పుడు సదరు వైద్యుడు వస్తారని వైద్యసిబ్బంది చెబుతుండడం శోచనీయం.

జిల్లాలో ప్రభుత్వ ఆస్ప్రతులు ఇలా..

వైద్య ఆరోగ్య శాఖ..

పీహెచ్‌సీలు 34

యూపీహెచ్‌సీలు 18

పీపీ యూనిట్‌ 1

లెప్రసీ వార్డు 1

డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌

జిల్లా ఆస్పత్రి 1

ఏరియా ఆస్పత్రులు 5

కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లు 3

వైద్యులు 200లకుపైగా..

నిత్యం 16 వేలకుపైగా రోగులు..

మధ్యాహ్నం ఇళ్లు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంటున్న వైద్యులు

వైద్యులు లేకపోవడంతో సొంత వైద్యం చేస్తున్న సిబ్బంది

కునారిల్లుతున్న సర్కారు దవాఖానాలు

అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు ఓ వృద్ధుడు కర్ర చేతపట్టుకుని మధ్యాహ్నం పూట వచ్చాడు. అక్కడే ఉన్న నర్సు ఆ వృద్ధుడిని చూసి.. డాక్టర్‌ మధ్యాహ్నం ఉండరు తాతా.. రేపు ఉదయం రా అని చెప్పింది. సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన డాక్టర్‌ ఉండకపోతే అడిగేవారే లేకుండా పోయారు అంటూ సణుగుతూ వెనుదిరిగాడు.

జ్వరంతో వణుకుతూ ఓ పెద్దావిడ పీహెచ్‌సీకి మధ్యాహ్నం సమయంలో వచ్చింది. ఆమెను చూసిన నర్సు ఇప్పుడు వచ్చావేంటి డాక్టర్‌ ఉండరు కదా.. ఉదయం రాకపోయావా అన్నారు. ఉన్నట్టుండి చలిజ్వరం రావడంతో వచ్చానమ్మ అని ఆ పెద్దావిడి సమాధానమిచ్చింది. దీంతో ఆ నర్సు డాక్టర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పగా.. పారాసెట్‌మాల్‌, యాంటీబయాటిక్‌ ఇచ్చి పంపించేయ్‌.. రేపు ఉదయం రమ్మని చెప్పు.. అని కటువుగా వైద్యుడు చెప్పాడు.

మధ్యాహ్నం.. అందని వైద్యం 1
1/1

మధ్యాహ్నం.. అందని వైద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement