పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా.. | - | Sakshi
Sakshi News home page

పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా..

Aug 7 2025 8:06 AM | Updated on Aug 7 2025 9:14 AM

పశువు

పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా..

చింతలపూడి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు పాడి పశువులను పెంచుకుంటూ ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అయితే వర్షాకాలంలో పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగు నీటితో కలిసి కలుషితం కావడం కారణంగా పశువులు ఆ నీటిని తాగడంతో అంటురోగాలు సోకి విలువైన పశు సంపద కోల్పోయే ముప్పు ఉంది. వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, పడ్డలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా కె లింగయ్య వివరించారు.

ఎలా సంక్రమిస్తుంది

పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాసపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్‌ హీట్‌ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచిపోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది.

గురక వ్యాధి చికిత్స

వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్‌, క్లోక్సా సిలిన్‌, జెంటా మైసిన్‌, సెఫలాక్సిన్‌ వంటి యాంటి బయోటిక్‌ మందుల్ని సరైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తం లోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్‌ ఇంజక్షన్‌లు, బి–కాంప్లెక్స్‌ ఇంజక్షన్‌లు బాగా నీరశించిన పశువుకై తే డెక్ట్‌స్రోజ్‌ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది.

నివారణ

గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు పరికరాలు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డిడిటి, గమాక్సిన్‌ ,సైపర్‌ మెధ్రిన్‌, కార్పొరిల్‌ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనీయ్యాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. పశువైద్యల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది.

డా కె లింగయ్య, పశు సంవర్థక శాఖ ఏడీ, చింతలపూడి

పాడి–పంట

పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా.. 1
1/2

పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా..

పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా.. 2
2/2

పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement