
చెట్లకు చేటు
జంగారెడ్డిగూడెం: విద్యుత్ లైన్ పేరు చెప్పి భారీ వృక్షాలను అక్రమంగా నరకివేసి కలప తరలించుకుపోయారు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురంలో పంచాయతీ రాజ్ రోడ్డు వెంబడి భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిని కొందరు అక్రమార్కులు బుధవారం నరికివేశారు. స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే విద్యుత్ లైన్‌ల నిర్మాణం నిమిత్తం చెట్లను నరికినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి ప్రజా సంఘాల నాయకులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీఐ నాయకులు జేవీ రమణరాజు, రాధాకృష్ణ చెట్ల నరికివేతపై పంచాయతీ రాజ్ డీఈ సాజుద్దీన్‌కు ఫిర్యాదు చేయగా చెట్ల నరికివేతకు సంబంధించి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ డీఈ యు.సుబ్బారావును వివరణ కోరగా, తాము ఆ ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ లైన్‌లు వేసే పనులు నిర్వహించడం లేదని చెప్పారు. అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ శాఖల పేర్లు చెప్పి వాటిని తరలించుకుపోవడంపై ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనిపై సాజుద్దీన్ స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చెట్లకు చేటు

చెట్లకు చేటు

చెట్లకు చేటు