
నిమ్మ ధర పతనం
కామవరపుకోట: నిమ్మ ధర దిగజారటంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. గత వారం రోజుల నుంచి నిమ్మకాయ రేట్లు పడిపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం కామవరపుకోట మార్కెట్ యార్డులో రైతుకు కిలో రూ.8 నుంచి రూ.10 రూపాయలకు నిమ్మకాయల రేటు దిగజారిపోయింది. మండలంలో వేల ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో రూ.100 పైబడి నిమ్మ ధర పలికింది. ఇప్పుడు దారుణంగా పడడంతో కూలీల ఖర్చు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో నిమ్మ ధర లభించడంతో చాలామంది రైతులు మరి ముఖ్యంగా కౌలు రైతులు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు అధిక మొత్తంలో కౌలు చెల్లించి మరీ సాగు చేపట్టారు. ఈ ఏడాది మే నెల ప్రారంభం నుండే నిమ్మ ధర ఒక్కసారిగా పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు తిరిగిరాని పరిస్థితి నెలకొందని అప్పులు పాలవుతామని కౌలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేట్లు పడిపోవడం వల్ల కోత కోసే కూలీలకు ఖర్చులు , రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే రేట్లు నిమ్మకాయకు కొనసాగితే రైతులు అప్పులు పాలు కావాల్సిందేనని, నిమ్మ తోటలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. కొంతమంది వ్యాపారులు దళారులు కుమ్మకై ్క ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు అకాల వర్షాలు పంట దిగుబడి, నాణ్యతపై ప్రభావం చూపయని ఇది కూడా ధరల పతనానికి కారణమని మరి కొంతమంది చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిమ్మ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యాపారుల సిండికేట్‌ను నియంత్రించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆందోళనలో రైతులు

నిమ్మ ధర పతనం