
మట్టి కొట్టుకుపోయిన రూ.3 కోట్లు
ఉండి: 2024–25కు సంబంధించి ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల ఖర్చుల్లో రూ.3.50 కోట్లు అధిక చెల్లింపు చేసినట్లు సామాజిక తనిఖీ బృందాలు గుర్తించాయి. శనివారం ఉదయం నుంచి ఉండి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజావేదిక సభలో తనిఖీ బృందాల నివేదికలపై మాత్రం తప్పుదారి పట్టించేలా అధికారులు సమాధానమిచ్చారు. 2024–25 ఏడాదికి 19 గ్రామాల్లో సుమారు రూ.5.44 కోట్లకు పైగా విలువైన 1059 పనులు నిర్వహించారు. పంచాయతీరాజ్ విభాగంలో 22 పనులు రూ.67 లక్షలతో చేపట్టారు. చేపట్టిన పని ఒకటైతే నమోదు చేసిన పని మరొకటి కావడంతో సామాజిక తనిఖీ బృందాలు మండల వ్యాప్తంగా రూ.3.50 కోట్లు అధిక చెల్లింపులు చేసినట్లు నివేదికను రూపొందించాయి. కాలువలు, పంట బోదెల్లో చేపట్టిన పనులు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. వాటిల్లో కేవలం తూడు, గుర్రపుడెక్క తొలగించారని తనిఖీ బృందాలు నివేదిక ఇస్తే.. మట్టి తీశామని ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది అధికారులు వాదించారు. మట్టి పనిచేస్తే ఎందుకు ఫోటోలు ఆన్‌లైన్ చేయలేదన్నారు. అంతే అంటూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు సమర్ధించుకున్నారు. పంట కాలువలు, బోదెల్లో వేసవిలో నీరు వుంటుందని మట్టి తీసినా కనిపించదంటూ విచిత్రంగా సమాధానాలు చెప్పారు. పనిచేసే సమయంలో ఫొటోల్లో ఎందుకు తీసిన మట్టి కనిపించలేదని పలువురు వాదించినా చెప్పిందే చెప్పి సమస్యను కప్పిపుచ్చేందుకు పీడీ పయత్నించారు.
సమావేశం అనంతరం పీడీ మాట్లాడుతూ పనుల్లో జరిగిన అవతవకలు రూ.1.61 లక్షలు రికవరీ రాశామని తెలిపారు. పలు గ్రామాల్లో వచ్చిన ఆరోపణలపై అధికారుల ఆధ్వర్యంలో రూ.5.67 లక్షల విలువైన పనులపై ఎంక్వయిరీ వేసినట్లు తెలిపారు. తనిఖీ బృందాల నివేదికల ప్రకారం.. వారు గుర్తించిన రూ.3.50 కోట్ల అధిక చెల్లింపుల్లో భాగంగా రూ.3.07 కోట్ల పనులకు సంబంధించి పని సమయంలో తీసిన ఫోటోలు అప్‌లోడ్ చేయాలని.. అలా చేయని పక్షంలో మొత్తం రూ.3.07 కోట్లు తిరిగి చెల్లించాలని మండల ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీడీ సుజాత, విజిలెన్స్ జిల్లా అధికారి పురుషోత్తం, క్వాలిటీ కంట్రోల్ జేఈ శ్రీకాంత్, ఎంపీడీవో ఎంవీవీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.