
సర్ప సంరక్షణలో క్రాంతి కిరణం
●స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా సేవలు ●పాములపై ప్రజలకు అవగాహన
జూలై 1.. జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలోకి కోడెనాగు ప్రవేశించింది. సంతోష్ అనే కానిస్టేబుల్ కాళ్ల మధ్యలో నుంచి పాము కార్యాలయంలోనికి రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. విషయాన్ని స్నేక్ సేవియర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు చదలవాడ క్రాంతికి సమాచారం అందించారు. వెంటనే క్రాంతి అక్కడికి వచ్చి ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో పోలీసు సిబ్బంది అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఫిబ్రవరి 17.. జంగారెడ్డిగూడెంలోని కిడ్స్ కాన్వెంట్‌లోకి ఏడడుగుల గోధుమ తాచు ప్రవేశించింది. పాఠశాల ఆవరణలోని చెట్టు మొదళ్లలో పాము కనిపించడంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ సేవియల్ సొసైటీ వ్యవస్థాపకుడు చదలవాడ క్రాంతికి సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన ఇక్కడకు చేరుకుని చాకచక్యంగా గోధుమ తాచును పట్టుకున్నారు. అనంతరం సురక్షిత ప్రాంతానికి తరలించారు.
దీంతో పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
జంగారెడ్డిగూడెం : పాము కనపడగానే ఎవరికై నా వెన్నులో వణుకు పడుతుంది. దానిని చంపే యాలని చూస్తాం. అయితే ఆ యువకుడు చాక చక్యంగా దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలి వేస్తున్నాడు. పాము నుంచి మనిషికి, మనిషి నుంచి పాముకు రక్షణ కల్పించాలనే ఆలోచనతో స్నేక్ సేవియర్‌గా మారి సేవలందిస్తున్నాడు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి. 15 ఏళ్లుగా పాముల సంరక్షుడిగా ఉన్నాడు. 2016లో స్నేక్ సేవియర్ సొసైటీని స్థాపించి సర్పాల సంరక్షణతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.
పేరంపేటకు చెందిన వ్యవసాయ కూలీలైన చదలవాడ రాజారావు, వెంకాయమ్మ కుమారుడు క్రాంతికి చిన్నతనం నుంచి ప్రకృతి, వన్యప్రాణులంటే ఇష్టం. చిన్నతనంలో పొలం పనులకు వెళ్లే సమయంలో పాము పిల్లలతో ఆడుకునేవాడు. తర్వాత కాలంలో పాములపై ఆసక్తి పెంచుకున్నా డు. పాములు పట్టడంలో కేరళలో శిక్షణ ఇస్తారని మిత్రుల ద్వారా తెలుసుకున్నాడు. 2009లో కేరళలోని కొట్టాయంలో పాములు పట్టడం, సంరక్షించడంలో వావా సురేష్ వద్ద 8 నెలల కఠోర శిక్షణ పొందాడు. తర్వాత విశాఖకు చెందిన రొక్కం కిరణ్‌కుమార్ వద్ద మరికొన్ని మెళకువలు నేర్చుకున్నాడు. 2010 నుంచి 2016 వరకు విశాఖలో ప్రజలకు సేవలు అందించాడు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లాకు తిరిగి వచ్చి 2016 డిసెంబర్ 31న స్నేక్ సేవియర్స్ సొసైటీ సంస్థను స్థాపించాడు. అప్పటినుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పాముల సంరక్షణకు కృషి చేస్తున్నాడు.
15 ఏళ్లు.. 19 వేలకు పైగా పాములు
క్రాంతి పాములు, వన్య ప్రాణుల సంరక్షణలో 15 ఏళ్లుగా తన వంతు బాధ్యత పోషిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 19 వేలకుపైగా పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. అలాగే స్నేక్ సేవియర్ సంస్థ ద్వారా పా ముల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50కి పైగా పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాడు. పాములు, వన్య ప్రాణులను రక్షించడం, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడమే స్నేక్ సేవియర్ సొసైటీ ముఖ్య ఉద్దేశమని క్రాంతి అంటున్నాడు. పాములకు హాని కలగకుండా చూడటమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
స్నేక్ కంట్రోల్ పౌడర్ విక్రయిస్తూ..
కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేసిన క్రాంతి లాభదాయకంగా లేక కౌలు సేద్యం మానివేశాడు. ప్రస్తుతం పొలం పనులకు వెళుతూ పార్ట్ టైమ్‌గా కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పాములు పట్టుకున్నప్పుడు అభిమానంతో వారిచ్చే సొమ్ము కొంత ఇంటి నిర్వహణకు ఉపయోగపడుతుంది. అలాగే స్నేక్ కంట్రోల్ పౌడర్‌ను కిలో రూ.500కు విక్రయిస్తున్నాడు. ఇలా నెలకు 20 ప్యాకెట్ల వరకు అమ్ముతున్నాడు. ఈ పౌడర్ చల్లితే ఆ ప్రాంతంలోకి పా ములు రావని చెబుతున్నాడు. క్రాంతి తండ్రి రాజారావు ఇటీవల మృతిచెందారు.
గోధుమ తాచు పాముతో..

సర్ప సంరక్షణలో క్రాంతి కిరణం

సర్ప సంరక్షణలో క్రాంతి కిరణం