
ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి
నూజివీడు: పీయూసీలో చేరిన విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ బాగా చదువుకొని ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అన్నారు. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు చెందిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మంగళవారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలోని విద్యావిధానం పట్ల అవగాహన పెంచుకొని తరగతిలో మెంటార్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని చదువుకోవాలన్నారు. ఈనెల 21 నుంచి అకడమిక్ షెడ్యూల్ ప్రకారం తరగతులు జరుగుతాయని, 28 నుంచి స్టడీ అవర్స్ ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులంతా స్నేహభావంతో మెలగాలని, అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, ర్యాగింగ్ జోలికి వెళ్లినా విద్యార్థులను పంపించేస్తామని హెచ్చరించారు. డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, ఏఓ లక్ష్మణరావు, డీన్ స్టూడెంటు వెల్ఫేర్ బాలురు రాజేష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ బాలికలు దుర్గాభవాని, చీఫ్ వార్డెన్ సురేష్ బాబు పలు సూచనలు చేశారు. అసోసియేట్ డీన్స్ భరత్, రఘు తదితరులు పాల్గొన్నారు.