
మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: మైనింగ్ మాఫియాకు కై కలూరు నియోజకవర్గం కేజీఎఫ్ గనిగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే మట్టి, ఇసకను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత రావడంతో పగటిపూట కాకుండా సాయంత్రం నుంచి తెల్లవార్లు టిప్పర్లతో ఇతర జిల్లాలకు తరలించేస్తున్నారు. నేషనల్ హైవే పనులు పేరు చెప్పి సీనరేజ్ చెల్లించకుండా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. శ్రీనా బంధువులైనా టిప్పర్లతో మైనింగ్ చేస్తూ బయట విక్రయిస్తే కేసులు పెట్టండిశ్రీ అని మీడియా ముందు పోలీసులకు చెప్పడం ఉత్తుత్తి మాటలని తేలిపోయాయి.
హైవే పనులు చెప్పి అక్రమార్జన
నియోజకవర్గంలో పెదపాలపర్రు నుంచి ఉప్పుటేరు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు రూ.275 కోట్లతో చేస్తున్నారు. ఈ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. అధికారంలోకి రాగానే హైవే పనులకు మట్టిని తరలించే వాళ్ళను కాదని, కూటమి నేతలు కొందరు టిప్పర్లతో ఇసుకను రవాణా చేస్తున్నారు. టిప్పర్లపై తీవ్ర విమర్శలు రావడంతో మార్చి 22న ఎమ్మెల్యే కామినేని నెల రోజుల్లో 5,000 టిప్పర్ల తరలింపునకు హైవేకు అవకాశం కల్పించాలన్నారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి హైవేకు కాకుండా బయటకు వెళ్తే సీజ్ చేయాలని ఆర్డీవో, సీఐలకు అదేశించారు. తిరిగి ఏప్రిల్ 27న హైవే పనులకు 10,000 టిప్పర్లు అవసరం ఉందని, కై కలూరు, మండవల్లి మండలాల్లో మాత్రమే అనుమతించాలని చెప్పారు. చివరకు పోలీసులు ఏర్పాటు చేసిన సరిహద్దుల్లో చెక్ పోస్టులు సైతం తీసేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అమెరికా వెళ్ళారు. ఇదే అదునుగా రాత్రి వేళ టిప్పర్లను ఇతర జిల్లాలకు కూటమి నేతలు తరలిస్తున్నారు.
టిప్పర్లతో రోడ్లు ధ్వంసం
టిప్పర్ల దెబ్బకు నియోజకవర్గంలో పలు రహదారులు ధ్వంసమయ్యాయి. వాస్తవానికి ఆర్‌అండ్‌బీ రహదారులు 25 నుంచి 30 టన్నులను భరించగలవు. టిప్పర్లు ఏకంగా 40 టన్నుల పైగా అధికలోడుతో వెళ్తున్నాయి. దూరాన్ని బట్టి ఒక్కో టిప్పరును రూ.10,000 నుంచి రూ.11,000 విక్రయిస్తున్నారు. ఇటీవల కై కలూరు – కలిదిండి రోడ్డును నిర్మించారు. ఈ రహదారి టిప్పర్ల కారణగా దెబ్బతింది. ప్రధానంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వగ్రామమైన వరహాపట్నం రింగ్ వద్ద మరింత దారుణంగా మారింది. రాచపట్నం, గోపవరం, వేమవరప్పాడు, వెంకటాపురం, గోపాలపురం పెదగొన్నూరు, వణుదుర్రు, దేవపూడి, బొమ్మినంపాడు, శీతనపల్లి, చిగురుకోట, భైరవపట్నం, గన్నవరం వంటి ప్రాంతాల్లో మైనింగ్ కారణంగా రోడ్లు పాడవుతున్నాయి. అధిక లోడు వాహనాల కారణంగా పాడైన రోడ్డుకు రూ.20 లక్షల వరకు పరిహారం చెల్లించాలనే నిబంధన అమలు కావడం లేదు. నేషనల్ హైవే డీఈఈ సత్యనారాయణను వివరణగా కోరగా ప్రస్తుతానికి హైవే పనులకు టిప్పర్లు తిరగడం లేదన్నారు.
కై కలూరు నియోజకవర్గంలో నిబంధనలు పాటించని మైనింగ్ నిర్వాహకులు
ఎమ్మెల్యే కామినేని స్వగ్రామం వరహాపట్నం రోడ్డుకూ గుంతలు
సీనరేజ్ చెల్లించకుండా రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి
నిబంధనలు గాలికి.. ఆదాయం జేబులోకి..
మైనింగ్ చేయాలంటే సవాలక్ష నిబంధనలు విధించారు. మైనింగ్ మాఫియాకు మాత్రం ఇవేవీ పట్టదు. ప్రభుత్వానికి వచ్చే రూ.కోట్ల అదాయాన్ని మాట్టి మాఫియా తమ జేబుల్లో నింపుకుంటుంది. మైనింగ్ విషయంలో టిప్పర్లకు, ట్రాక్టర్లకు ఒకే నిబంధన ఉంటుంది. ఇక్కడ ట్రాక్టర్లకు ఏకంగా అధికారులే మినహాయింపు ఇస్తున్నారు. ఇప్పటికే ఆక్వా చెరువుల కారణంగా అధిక ఉత్పత్తులతో వెళ్తున్న చేపల లోడులతో ఈ ప్రాంతంలో రహదారులు పాడయ్యాయి. ఇప్పుడు మట్టి టిప్పర్లతో మరింతగా ధ్వంసమవుతున్నాయి. ఇప్పటికై న జిల్లా అధికారులు మట్టి అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం

మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం

మైనింగ్ దెబ్బకు రోడ్లు ఛిద్రం