
పాఠశాల విలీనంపై మిన్నంటిన నిరసన
సర్పంచ్ ప్రియాంక నిరహార దీక్షను అడ్డుకున్న పోలీసులు
పెనుమంట్ర: పెనుమంట్ర దళితవాడలోని ఎలిమెంటరీ పాఠశాలను దూరంగా ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సర్పంచ్ తాడిపర్తి ప్రియాంక, ప్రసన్న కుమార్ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా దీక్ష చేయడానికి ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అనుమతులు లేవంటూ ఉదయమే పోలీసులు తొలగించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రియాంక దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నేలపైనే బైఠాయించారు. వీరికి మద్దుతుగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా నేలపైనే బైఠాయించి అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మండల విద్యాశాఖ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నాయకులు
తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన విషయాన్ని తెలుసుకున్న ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్ర, పోడూరు జెడ్పీటీసీ సభ్యులు కర్రి గౌరీ సుభాషిని, గుంటూరు పెద్దిరాజులతో పాటు పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సర్పంచ్ ప్రియాంకకు మద్దతుగా నిలిచారు. తహసీల్దార్ వై.రవికుమార్, ఎస్సై స్వామి నాయకులతో గంటకు పైగా చర్చించిన అనంతరం విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కొద్ది రోజుల్లోనే న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్ ప్రియాంకతో పాటు తల్లిదండ్రులు నిరసన విరమించారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు వాసంశెట్టి కిరణ్, ఈది అనిత ప్రవీణ్, మండల సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షుడు తమనంపూడి వీర్రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు, సర్పంచ్ గూడూరు దేవేంద్రుడు, నాయకులు కొవ్వూరి వేణుమాధవ్ రెడ్డి, కర్రి రామలింగేశ్వరరెడ్డి, సత్తి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల విలీనంపై మిన్నంటిన నిరసన