
రాష్ట్రస్థాయి లేజర్ రన్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ
తణుకు అర్బన్: స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి లేజర్ రన్ (రన్నింగ్ –షూటింగ్ )పోటీల్లో తణుకు మండలం మండపాక గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్. నాగ సత్య గణేష్ అండర్ 17 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల హెచ్‌ఎం కె.ఫణిశ్రీ తెలిపారు. గణేష్ ఈ నెల 12, 13 తేదీల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి లేజర్ రన్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థి గణేష్‌తో పాటు శిక్షణనిచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను పలువురు అభినందించారు.
చేబ్రోలు సర్పంచ్‌కు అరుదైన గుర్తింపు
ఉంగుటూరు: మండలంలోని చేబ్రోలు సర్పంచ్ రందే లక్ష్మీసునీతకు అరుదైన గుర్తింపు లభించింది. జాతీయస్థాయిలో నిర్వహించే సర్పంచ్ సంవాద్‌లో ప్రథమ స్థానం లభించింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్పంచ్ సంవాద్ అనే వేదికను ఏర్పాటు చేశారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా ప్రతి నెలా దేశంలో ఉండే సర్పంచ్‌లు గ్రామాలు ఎలా అభివృద్ధి చేస్తున్నారు? ఇంకా ఎలా చేయాలి? అనే అంశాలపై వారి అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. అయితే చేబ్రోలు సర్పంచ్ సునీత వర్మీ కంపోస్టు తయారు చేయడం, పరిశుభ్రత విషయం, తడిచెత్త పొడిచెత్త విడదీయటం, మంచినీటి వనరులు కాపాడుకునే విషయంపై 80 సెకన్లు నిడివితో ఉన్న వీడియో పంపారు. ఈ నేపథ్యంలో ఆమె జూన్ నెలకు సంబంధించి ప్రథమ స్థానంలో నిలిచారు. లక్ష్మీసునీతకు ప్రోత్సాహకంగా రూ.35 వేలు అందిస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీ సునీత శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అవార్డు రావడం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు.
గోదావరికి పంచ హారతుల సమర్పణ
పెనుగొండ: ఆషాఢ పౌర్ణమి సందర్భంగా వశిష్టాగోదావరికి శుక్రవారం సిద్ధాంతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంచ హారతులు ఇచ్చారు. పూజా కార్యక్రమాలు అనంతరం కలగ భద్రుడు బ్రహ్మత్వంలో గోదావరి హారతులునిచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మపరిరక్షణ సభ్యులు, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
దెందులూరు: మండలంలోని మేధినరావుపాలెం గ్రామానికి చెందిన గారపాటి నాగేంద్ర అదృశ్యమయ్యాడంటూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నాగేంద్ర గురువారం కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్రవారం పోలవరం కాలులో అతని సెల్‌ఫోన్, చెప్పులు కనిపించాయంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

రాష్ట్రస్థాయి లేజర్ రన్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ

రాష్ట్రస్థాయి లేజర్ రన్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ