
మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం
అవగాహన కల్పిస్తాం
ప్రేరేపిత ప్రయోగం విజయవంతం ద్వారా డాక్టర్ హీరాలాల్ చౌదరీ నీలి విప్లవానికి పితామహుడిగా మారారు. ఆయన 1994లో వరల్ట్ ఆక్వాకల్చర్ అవార్డు అందుకున్నారు. ప్రతి ఏటా మత్స్యశాఖ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కై కలూరు ప్రభుత్వ ఆక్వా ల్యాబ్‌లో రైతులకు గురువారం అవగాహన కలిగిస్తాం.
– సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కై కలూరు
కై కలూరు: చేపల గుడ్లు(స్పాన్) ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చేసిన ప్రయోగ ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఆక్వారంగం అగ్రభాగాన నిలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కటక్ సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనన్‌స్టిట్యూట్ (ఐసీఏఆర్)లో 1957 జూలై 10న డాక్టర్ హీరాలాల్ చౌదరీ, డాక్టర్ అలికున్హి శాస్త్రవేత్తలు కలిసి భారతదేశ మేజర్ కార్ప్స్‌పై విజయవంతమైన ప్రేరిత పెంపక ప్రయోగాన్ని(ఇన్‌డ్యూసిడ్ బ్రీడింగ్) చేపట్టారు. సాధారణ చేపల్లో ఉదాహరణకు ఐదు లక్షల స్పాన్ ఉత్పత్తి చేస్తే ప్రేరిత ప్రయోగం వల్ల ఆ సంఖ్య 10 నుంచి 20 లక్షలకు చేరింది. అప్పటి నుంచి నీలి విప్లవం తారా స్థాయికి పాకింది. బ్రీడింగ్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా జాతీయ చేపల రైతుల దినోత్సవం జూలై 10న జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రైతులకు గురువారం అవగాహన కార్యక్రమాలన నిర్వహిస్తున్నారు.
రికార్డు స్థాయిలో ఆక్వా సాగు
ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా రంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్ రూ.18 వేల కోట్లు ఉంది. దాదాపు ఆక్వా రైతులు 75 వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ జిల్లాల నుంచి 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక రాష్టం విషయానికి వస్తే 974 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ఆక్వా సాగు 2.26 హెక్టార్లులలో కొనసాగుతుంది. దిగుబడులు 10 లక్షల టన్నులుగా ఉంది. అమెరికాకు ఎగుమతి చేసే రొయ్యలు 3.27 లక్షల టన్నులుగా నమోదైంది. దేశంలోనే సింహభాగం ఉత్పత్తులకు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు మణిహారంగా మారాయి.
నీలి విప్లవంతో రికార్డులు
ఆక్వా సాగులో 1955 పూర్వం చేపల సాగు చేయాలంటే నదులు, సముద్రాలలో చేప పిల్లలను సేకరించాల్సి వచ్చేది. దీన్ని వైల్ట్ కలక్షన్ అంటారు. డాక్టర్ హీరాలాల్ చౌదరీ భారతీయ మేజర్ కార్ప్స్ (కట్లా, రోహు, మ్రిగల్)పై హార్మోన్ ప్రేరేపిత ప్రయోగం చేశారు. దీంతో కోట్లలో చేప స్పాన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత అన్యదేశ కార్ప్స్(కామన్ కార్ప్, గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్), టిలాపియా, పంగాసియస్ వంటి ఇతర చేపలు, మంచినీటి రొయ్యలైన మాక్రోబ్రాకియం, రోజెంబర్గి(స్కాంపీ) కూడా అభివృద్ధి చెందాయి. ఒక్క ప్రయోగం భారతీయ మత్స్య పరిశ్రమను సమూలంగా మార్చివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సరీలు, పెంపక చెరువులు నాణ్యమైన చేప విత్తనాల సరఫరాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇవి రాష్ట్రానికి మాత్రమే కాక, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా చేప విత్తనాలను సరఫరా చేస్తున్నాయి.
కొల్లేరులో చేపల పట్టబడులు చేస్తున్న దృశ్యం (ఫైల్)
నేడు జాతీయ చేపల రైతు దినోత్సవం
ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు
ఆక్వా అంటేనే కొల్లేరు
ఆక్వా పరిశ్రమకు కొల్లేరు లంక గ్రామాలు పెట్టింది పేరుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 9 మండలాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. చిత్తడి నేలల కారణంగా చేపల, రొయ్యల పెరుగుదల అధికంగా ఉంటుంది. ఇక చేప పిల్లలను ఉత్పత్తి చేసే ప్రభుత్వ హేచరీ ఏలూరు జిల్లా బాదంపూడిలో ఉంది. చేప నారును సాగు చేసే మత్స్యశాఖనకు చెందిన సీడ్ ఫాంలు ఏలూరు, కొవ్వలిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి రోజూ 240 లారీలు ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో ఆక్వాకు సంబంధించి ప్రాసెసింగ్ ప్లాంట్లు 106, ఐస్ ప్లాంట్లు 258, ఏడాదికి 60,000 మినియన్ల ఉత్పత్తి చేసే రొయ్యల హేచరీస్, ప్రతి రోజూ 9,750 టన్నుల ఉత్పత్తి చేసే మేతల ఫ్యాక్టరీలు 429, ఆక్వాషాపులు 1104, ఆక్వా ల్యాబ్‌లు 237 ఉన్నాయి.

మత్స్యం.. కొల్లేరు ప్రత్యేకం