
పేరెంట్స్ మీట్‌పై టీచర్లకు షరతులు
నిడమర్రు: పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.ఓ కార్యక్రమం నిర్వహణపై విద్యాశాఖ అధికారులు షరతు విధించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 వరకూ జరుగుతుందీ లేనిది ఇతర శాఖ ఉద్యోగి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి మెగా పీటీఎం రోజున 30 సెకన్ల వీడియో, నాలుగు ఫొటోలు, మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రధానోపాధ్యాయులు ఉపయోగిస్తున్న లీప్ యాప్‌లో సాక్షిగా వచ్చిన వ్యక్తి అప్‌లోడ్ చేయాని గురువులకు విద్యాశాఖ అధికారులు షరుతు విధించారు. దీని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
యాప్‌ల భారంతో సతమతం
ఉపాధ్యాయులకు యాప్‌ల భారం తగ్గించి అన్ని యాప్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, సరికొత్త యాప్ రూపొందిస్తామని విద్యా శాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన తొలి సమావేశంలో ప్రకటించారు. లీప్ యాప్‌ను రూపొందించినా.. రోజూ మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నిర్వహణ వంటి కార్యక్రమాలతోపాటు స్టాక్ అందిన ప్రతిసారి పాత ఐఎంఎంఎస్‌లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల పాఠశాలలకు అందిస్తున్న సన్నబియ్యంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్టాక్ అందిన వెంటనే స్కాన్ చేయాలి. తర్వాత బస్తా ఓపెన్ చేసిన వెంటనే స్కాన్ చేయాలి. విద్యార్థులకు మొక్కలు, అపార్ ఐడీ క్రియేట్ వంటి అనేక అన్‌లైన్ కార్యక్రమాలతో బోధనకు దూరమవుతున్నామంటూ ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
కుంటుపడుతున్న బోధన
పాఠశాల తెరిచిన నాటి నుంచి పాఠశాలల్లో సంసిద్ధతా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. 1, 2 తరగతులకు 45 రోజులు, మిగిలిన ప్రాథమిక తరగతులకు 30 రోజులుగా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఇంతవరకూ గమనిస్తే ప్రారంభంలో బదిలీలు, జాయినింగ్‌లు, రిలీవింగ్‌లతో 10 రోజులు గడిచిపోయాయి. తర్వాత గిన్నిస్ రికార్డ్ కోసం అంటూ యోగాంధ్ర కార్యక్రమాలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్లతో మరికొన్ని రోజులు గడిచాయి. జులై 1 నుంచి పూర్తిస్థాయిలో బోధనపై దృష్టి పెడతామంటే మరో గిన్నిస్ రికార్డు పేరుతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.ఓ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొక్కల కోసం విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, కమిటీల ఏర్పాటు, ఆహ్వానాలు, మండల స్థాయి నుంచి, పాఠశాల స్థాయి వరకూ ముందస్తు సమావేశాలతో ఉపాధ్యాయులంతా బిజీగా ఉండటతో, బోధనా కార్యక్రమాలు కుంటుపడినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.
కార్యక్రమం నిర్వహణపై ఇతర శాఖల ఉద్యోగులు సాక్ష్యంగా ఉండాలి
విద్యా శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీచర్ సంఘాలు
ఇతరుల పర్యవేక్షణ అంగీకరించం
ఈ నెల 10న జరిగే మెగా పీటీఎంకు ఇతర శాఖల ఉద్యోగుల పర్యవేక్షణ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత పీటీఎంను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సహకారంతో విజయవంతం చేశాం. ఇప్పడు బాహ్య పరిశీలకుల పేరిట ఇతర శాఖ ఉద్యోగుల నియమించడం పాఠశాల నిర్వహణ వ్యవస్థను, ఉపాధ్యాయుల పనితీరు కించపరచడమే.
–షేక్ రంగా వళి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
మెగా పీటీఎంను విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యాశాఖకు సంబంధం లేని ఓ వ్యక్తిని బాహ్య పరిశీలకుడిగా నియమించుకోవాలని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే అమలు చేస్తున్నాం. సాక్షి సంతకం నిబంధన గిన్నిస్ బుక్ రికార్డు కోసమే అని, గిన్నిస్ రికార్డుల నమోదు బృందం సూచనల మేరకే సాక్షి సంతం తీసుకుంటున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు.
ఏవీఎస్‌ఎస్ భాస్కర కుమార్, ఎంఈవో–2, నిడమర్రు

పేరెంట్స్ మీట్‌పై టీచర్లకు షరతులు

పేరెంట్స్ మీట్‌పై టీచర్లకు షరతులు