
ధీమా ఇవ్వని బీమా
ఏలూరు (మెట్రో): అన్నదాతకు కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో సాగు అంటే పండుగ అనేరీతిలో ప్రతి సీజన్‌ను ఉత్సాహంగా రైతులు మొదలుపెట్టేవారు. అయితే ప్రస్తుత కూటమి పాలనలో అడుగడుగునా ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమాతో రైతులకు అండగా నిలవగా.. ప్రస్తుత కూటమి సర్కారు ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో సీజన్ ప్రారంభంలో పెట్టుబడులకు రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. జిల్లాలో 99,515 హెక్టార్లలో రైతులు పలు పంటలు సాగుచేస్తున్నారు.
రైతులే చెల్లించాలని..
ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేలా గత జగన్ సర్కారు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించేది. దీంతో రైతులకు భారం ఉండేది కాదు. అలాగే విపత్తుల సమయంలో నష్టపరిహారం సులభంగా అందేది. అయితే ప్రస్తుతం బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రూ.25 కోట్ల మేర భారం
జిల్లాలో వరి, మినుములు, పత్తి, నిమ్మ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు చివరి తేదీలు సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లాలో ఎకరా చొప్పున వరికి రూ.840, మినుముకు రూ.300, పత్తికి రూ.1,900, నిమ్మకు రు.2,500 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. వరికి ఆగష్టు 15, మినుముకు జూలై 31, పత్తి, నిమ్మకు జూలై 15న చివరి తేదీగా గడువు విధించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులో రైతులకు ఇచ్చే పంట రుణాల్లోనే ప్రీమియం సొమ్ము మినహాయించుకునేలా ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సుమారు 99 వేల హెక్టార్లలో పలు రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. సుమారు 4.50 లక్షల మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీరిపై సుమారు రూ.25 కోట్ల మేరకు బీమా ప్రీమియం భారం పడనుంది.
ఉచిత పంటల బీమాకు తిలోదకాలు
ప్రీమియం చెల్లించేందుకు రైతుల అవస్థలు
ఇప్పటికీ అందని ‘అన్నదాత సుఖీభవ’
జిల్లాలో 99 వేల హెక్టార్లలో సాగు