
ఎండీయూ ఆపరేటర్ల పోరుబాట
ఏలూరు (టూటౌన్): ఒక్క కలం పోటుతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లను వీధిన పడేసింది. దీంతో ఎలా జీవించాలంటూ జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు పోరు బాట పట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారనే సాకుతో కక్ష గట్టి అగ్రిమెంట్ మరో 20 నెలలు ఉండగానే తొలగించడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. వాహనాలకు సంబంధించి మరో 20 ఈఎంఐలు ఎలా కట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసే పక్షంలో తాము చెల్లించాల్సిన మొత్తం బకాయి ఈఎంఐలను రద్దు చేసి, తమకు ఎన్‌ఓసీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందించాలని కోరుతున్నారు. శనివారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఎండీయూ ఆపరేటర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వీరి ఆందోళనకు వైఎస్సార్‌సీపీ, ఏఐటీయూసీ మద్దతు ప్రకటించాయి.
రాష్ట్రంలోని ఎండీయూ వ్యవస్థకు సంబంధించి ఆపరేటర్లకు 2027 జనవరి వరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉంది. దాన్ని పక్కన బెట్టి కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి రేషన్ డీలర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం మోసపూరితమని విమర్శిస్తున్నారు. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ, ఈబీసీలకు చెందిన యువత ఉపాధి పొందాని.. ఎండీయూ వ్యవస్థ రద్దుతో వీరంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 394 మంది ఎండీయూ ఆపరేటర్లు, 394 మంది హెల్పర్లు ఉపాధి కోల్పోనున్నారు.
కరోనా, వరదల్లో విశేష సేవలు
రాష్ట్రంలోని ఎండీయూ ఆపరేటర్లు కరోనా సమయంలో ప్రజలకు విశేష సేవలందించారు. విజయవాడ వరదల్లో బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడంలో కీలకంగా పనిచేశారు. విజయవాడలో వరదల సేవలందించినందుకు అదనపు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా నేటికీ ఒక్క పైసా ఇవ్వలేదు. ఎండీయూ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం, ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాఢీ కేంద్రాలకు బియ్యం సరఫరా వీరే చేస్తున్నారు. దీనికి ఎలాంటి అదనపు ప్రయోజనాలు కల్పించడం లేదు.
ఏలూరులో కదం తొక్కిన సిబ్బంది
ఎండీయూ వ్యవస్థనురద్దు చేయడంపై మండిపాటు
ఏలూరు జిల్లాలో వీఽధినపడ్డ 800 కుటుంబాలు
సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ, ఏఐటీయూసీ

ఎండీయూ ఆపరేటర్ల పోరుబాట

ఎండీయూ ఆపరేటర్ల పోరుబాట