
ఎంటీఎస్ టీచర్లు.. బదిలీల ఇక్కట్లు
ఎక్కడికి పంపుతారో తెలియని అయోమయం
దెందులూరు: మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయులు దశాబ్దాల పోరాటంతో కొలువు దక్కించుకున్నామనే ఆనందం ఎన్నో రోజులు మిగల్లేదు. కొన్నాళ్ళు ఏజెన్సీలో పనిచేస్తే ఆ తరువాత స్వగ్రామాలకు సమీపంలో పోస్టింగ్ ఇస్తామని చెబితే ఉద్యోగాల్లో చేరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారనే ఏకై క కారణంతో కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. టీచర్ల బదిలీలకు తెరలేపిన ప్రభుత్వం, ఎంటీఎస్ టీచర్లను గాల్లోపెట్టి, వారు పనిచేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించారు. దీంతో మళ్ళీ ఎక్కడికి పోవాలో తెలియక సతమతమవుతున్నారు. న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ–98 అభ్యర్థులు 274 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వేలేరుపాడు, కుక్కునూరు, టీ.నర్సాపురం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు వంద మందికి పైగా పోస్టింగులు ఇచ్చారు. మిగిలిన వారికి జిల్లాలో ఇతర ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారు.
జీతం తక్కువ.. పని ఎక్కువ
రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.32,470 వేతనం చెల్లిస్తున్నారు. దీంతో సొంత మండలాలు, లేదా సమీప మండలాల్లోని స్కూళ్లలోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది. దశలవారీగా వారిని మైదాన ప్రాంతానికి తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు దిశానిర్దేశం చేసింది. ప్రస్తుతం టీచర్ల బదిలీల నేపథ్యంలో 274 ఎంటీఎస్ స్థానాలను ఖాళీలుగా చూపారు. దీంతో రెగ్యులర్ టీచర్లు కోరుకోగా మిగిలిన ఖాళీలు మాత్రమే వీరికి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బడులు తెరిచాక.. ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియని అయోమయంలో ఎంటీఎస్ టీచర్లున్నారు.