
వైభవం..ఉగాది సంబరం
●విశ్వావసు.. విజయ తేజస్సు ●ద్వారకాతిరుమలలో ఘనంగా వేడుక
ద్వారకాతిరుమల: చిన వెంకన్న క్షేత్రంలో ఉగాది ఉత్సవం అంబరాన్నంటింది. ఆదివారం స్థానిక ఉగాది మండపంలో వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా ఉభయదేవేరులతో శేషవాహనంపై కొలువైన శ్రీవారిని అట్టహాసంగా మండపం వద్దకు తీసుకువచ్చారు. మండపంలోని రజిత సింహాసనంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పూజాదికాలు నిర్వహించారు. పండితులు పంచాంగ శ్రవణాన్ని పఠించి రాశి ఫలాలను వివరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు అర్పించారు. చివరగా పండిత సత్కారాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి దంపతులు, అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఆగమ విద్యార్థులు, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
పోటెత్తిన భక్తులు
కొత్త సంవత్సరాది కావడంతో చిన వెంకన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయ తూర్పురాజ గోపుర ప్రాంతం, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, టికెట్, ప్రసాదాల కౌంటర్లు, కేశఖండనశాల తదితర వి భాగాలు భక్తులతో కిక్కిరిశాయి.

వైభవం..ఉగాది సంబరం