
ఏలూరు సమీపంలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు
ఏలూరు టౌన్: ఏలూరు జాతీయ రహదారిపై సోమవరప్పాడు సమీపంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు బ్రిడ్జి పైనుంచి ఏలూరు – జంగారెడ్డిగూడెం రోడ్డుపై ఎగిరిపడింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తికి కాళ్ళు చేతులు విరగగా, మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన తలపాక శివాజీ సోదరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులంతా శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్ళారు. శివాజీ కారు డ్రైవ్ చేస్తుండగా మేనమామలు ఈసం లోవరాజు, ఈసం నూకరాజుతో కలిసి కారులో విజయవాడ బయలుదేరారు. సోమవారం సాయంత్రం సోమవరప్పాడు ప్రాంతంలో వేగంగా వెళుతోన్న కారు అదుపుతప్పి 20 అడుగుల ఎత్తు బ్రిడ్జిపై నుంచి పడింది.