అక్కచెల్లెమ్మలకు ఆసరా

- - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘2019 నాటికి డ్వాక్రా సంఘాలపై ఉన్న రుణ నిల్వలన్నీ నాలుగు వాయిదాల్లో ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. ప్రతి అక్కకు, చెల్లికి లబ్ధి చేకూర్చాలని వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తాం. ప్రతి డ్వాక్రా సంఘానికి ఎన్నికల ముందు ఉన్న బకాయిని నాలుగేళ్ల కాలవ్యవధిలో నాలుగు విడతల్లో ప్రభుత్వమే చెల్లించి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుంది’ అని ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని ఏటా నగదు జమ చేస్తున్నారు. ఈనెల 25న మూడో విడత నగదు జమ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లాలోని దెందులూరు వేదిక కానుంది.

చురుగ్గా పనులు

వైఎస్సార్‌ ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం ఈనెల 25న దెందులూరులో సీఎం జగన్‌ చేతులమీదుగా ప్రారంభం కానుంది. ముందుగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించిన అనంతరం బటన్‌ నొక్కి నేరుగా మహిళా సంఘాలకు నగదు జమ చేయనున్నారు. సీఎం పర్యటన జిల్లాలో ఖరారైన క్రమంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. దెందులూరులో హెలీప్యాడ్‌ నుంచి సీఎం చేరుకుని అక్కడ నుంచి దెందులూరులోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలోని సభా ప్రాంగణానికి వచ్చి ఆసరా మూడో విడత రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడో విడత నగదు జమ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని 35,748 డ్వాక్రా గ్రూపుల్లోని 3,55,315 మంది మహిళలకు రూ.328.34 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి, రెండు విడతల్లో నగదు జమ పూర్తయింది. ఇప్పుడు మూడో విడత పూర్తిచేసి వచ్చే ఏడాది నాల్గో విడత సాయం అందించి పూర్తి రుణమాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

మొత్తంగా రూ.2,770 కోట్ల రుణమాఫీ

2019 ఏప్రిల్‌ 11 నాటికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 63,775 డ్వాక్రా సంఘాల్లోని సుమారు 6.50 లక్షల మంది మహిళలకు రూ.2,770 కోట్ల రుణ బకాయిలున్నాయి. వీటన్నింటినీ మాఫీ చేస్తామని పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి, దానికనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మొదటి ఏడాది ఉమ్మడి జిల్లాలోని 63,775 గ్రూపుల్లోని 6,34,934 మంది మహిళలకు రూ.689.89 కోట్ల మేర నగదు అందించారు. అలాగే రెండో విడతలో 63,861 గ్రూపుల్లోని 6,35,871 మంది మహిళలకు రూ.693.61 కోట్లు జమ చేశారు.

35,748 సంఘాలు.. 3.55 లక్షల మంది సభ్యులు

మూడో విడతలో భాగంగా ఏలూరు జిల్లాలోని 35,748 డ్వాక్రా సంఘాల్లో 3,55,315 మంది మహిళలకు రూ.328.34 కోట్ల మేర నగదు జమ కానుంది. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో 59,279 మందికి రూ.66.44 కోట్లు, దెందులూరులో 53,354 మందికి రూ.53.66 కోట్లు, ఏలూరులో 11,334 మందికి రూ.8.91 కోట్లు, కై కలూరులో 52,932 మందికి రూ.46.69 కోట్లు, నూజివీడులో 53,189 మందికి రూ.46.76 కోట్లు, పోలవరంలో 59,172 మందికి రూ.44.15 కోట్లు, ఉంగుటూరులో 50,804 మందికి రూ.45.63 కోట్లు, గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలంలో 15,251 మందికి రూ.16.09 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా..

వైఎస్సార్‌ ఆసరాతో మహిళా సాధికారత

జిల్లాలో 3.55 లక్షల మందికి రూ.328.34 కోట్ల మేర లబ్ధి

ఈనెల 25న మూడో విడత నగదు జమ

దెందులూరులో లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

ముమ్మరంగా ఏర్పాట్లు

రూ.328.34 కోట్లు

ఇప్పటికే రెండు విడతల్లో మహిళలకు రుణ నిల్వను చెల్లించగా ఈ నెల 25న మూడో విడత కార్యక్రమం ద్వారా రూ.328.34 కోట్లు అందించనున్నాం. దీంతో 75 శాతం రుణ చెల్లింపు పూర్తవుతుంది. ముఖ్యమంత్రి చేతులమీదుగా దెందులూరులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

– కె.విజయరాజు, డీఆర్‌డీఏ పీడీ

Read latest Eluru News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top