‘సుప్రీం’ నిర్ణయం సబబే

Supreme Court orders Rajiv Gandhi assassination convicts Release - Sakshi

రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్షపడి మూడు దశాబ్దాలుగా జైళ్లలో మగ్గుతున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఆహ్వానించదగ్గది. సుదీర్ఘకాలం శిక్ష అను భవించటంతోపాటు వారి సత్ప్రవర్తన అంశం కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. రాజీవ్‌గాంధీ హత్య జరిగిన 1991 మే 21 మొదలుకొని చాలా తరచుగా ఈ కేసు జనం నోళ్లలో నానుతూనే ఉంది. ఈ ఉదంతంలో రాజీవ్‌తోపాటు ఒక ఎస్‌పీ స్థాయి అధికారి సహా 15 మంది మరణించారు. 1984లో ప్రధానిగా ఉంటూ ఖాలిస్థాన్‌ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు ఇందిరాగాంధీ బలైతే, ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ సైతం మరో ఏడేళ్లకు ఎల్‌టీటీఈ మిలిటెంట్లు చేసిన అదే మాదిరి మతిమాలిన చర్యకు ప్రాణాలు కోల్పోయిన తీరు దేశ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దాదాపు 90వ దశకం అంతా రాజీవ్‌ హత్య కేసు దర్యాప్తు, విచారణ సాగుతూనే ఉన్నాయి.

సీబీఐ ఈ కేసులో దర్యాప్తు జరిపి 41 మందిని నిందితులుగా చూపగా, టాడా కోర్టు అందులో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. తదుపరి సుప్రీంకోర్టు వారిలో 19 మందిని నిర్దోషు లుగా తేల్చి విడుదల చేసింది. ముగ్గురి మరణశిక్షను యావజ్జీవ శిక్షలుగా మార్చింది. నలుగురు దోషులు–మురుగన్, శంతన్, పేరరివాళన్, నళినిలకు మరణశిక్ష ఖరారు చేసింది. ఇక అప్పటినుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఇందులో తమిళనాడు రాజకీయాలు కూడా కలగలిశాయి. చివరకు 2000 సంవత్సరంలో సోనియాగాంధీ స్వయంగా తమిళనాడు గవర్నర్‌కు లేఖరాసి మరణశిక్ష పడిన నళినికి క్షమాభిక్ష పెట్టాలని కోరారు. దాంతో ఆమెకు ఉరికంబం బెడద తొలగింది. అప్పటినుంచి ఆమె యావజ్జీవ ఖైదీగా ఉంటున్నారు. తమ తండ్రి హంతకులను క్షమిం చామని ప్రియాంక, రాహుల్‌ కూడా వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. మరో పద్నాలుగేళ్లకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగిందన్న కారణంతో మురుగన్, శంతన్, పేరరివాళన్‌ల ఉరిశిక్షలను సర్వో న్నత న్యాయస్థానమే యావజ్జీవ శిక్షలుగా మార్చింది.

నిర్ణయ రాహిత్యంగా నిర్ధారించాలో లేక రాజకీయ అయోమయంగా పరిగణించాలో... ఆ తర్వాత కాలమంతా రాజీవ్‌ హంతకుల విషయంలో డోలాయమాన స్థితి ఏర్పడింది. సర్వోన్నత న్యాయస్థానం తేల్చాక కూడా దోషులకు శిక్షలు అమలు చేయకపోవటం గమనిస్తే తమిళనాడు రాజకీయాలను ఈ వ్యవహారం ఎంతగా ప్రభావితం చేసిందో గ్రహించవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకే సహా ప్రధాన ద్రవిడ పార్టీలన్నీ రాజీవ్‌ కేసు దోషులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నా వారితో కలిసి కూటమి కట్టడానికి అభ్యంతరం లేని కాంగ్రెస్‌కు ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయం ‘తీవ్ర బాధాకరం, దురదృష్టకరం’ ఎందుకైందో అర్థం కాదు. పైగా ఇది కేవలం కాంగ్రెస్‌ అభిప్రాయం తప్ప సోనియా ఉద్దేశం కాదట.

ఈ ప్రకటన విడుదల చేసిన పార్టీ నేత జైరాం రమేశ్‌ సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని ‘తీవ్ర తప్పిదం’గా విమర్శించారు. మరి యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆ దోషులకు అమలు చేయాల్సిన శిక్ష గురించి ఎందుకు ఆలోచించలేక పోయారు? మరణశిక్ష విధించటం అనాగరికమని చాలా దేశాలు ఆ శిక్షలను రద్దు చేశాయి. మన దేశం సైతం ఆ మాదిరి నిర్ణయమే తీసుకోవాలని కోరుకుంటున్న ప్రజాస్వామికవాదులున్నారు. దాన్నెవరూ తప్పు బట్టరు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్‌ గురును అతని కుటుంబానికి ముందస్తుగా తెలియజేయాలన్న నిబంధనను సైతం కాలదన్ని యూపీఏ సర్కారు ఉరి అమలు చేసిన సంగతి జైరాం రమేశ్‌ మరిచిపోకూడదు. రాజకీయ లబ్ధి కోసం తాము ఇష్టానుసారం ఏమైనా చేయొచ్చుగానీ సుప్రీంకోర్టు మాత్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించరాదనటం అర్ధరహితం.

దోషుల పిటిషన్లను విచారిస్తున్న సందర్భాల్లో మీ అభిప్రాయమేమిటని సుప్రీంకోర్టు  పలు మార్లు కేంద్రాన్ని అడిగింది. యూపీఏ హయాంలోనూ, ప్రస్తుత ఎన్‌డీఏ హయాంలోనూ కేంద్రం ఒకే మాదిరి వ్యవహరించింది. 2018లో అన్నా డీఎంకే ప్రభుత్వ కేబినెట్‌ రాజీవ్‌ కేసు దోషులందరినీ విడుదల చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేస్తూ తీర్మానించింది. ఆయన ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపారు. ఆ విషయంలో తుది నిర్ణయం రాష్ట్రపతిదేనని నిరుడు ఫిబ్రవరిలో కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘అసలు మీరు ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి పంపార’ని గవర్నర్‌ను కోరితే ఆయన నుంచి మౌనమే సమాధానమైంది. శిక్షల తగ్గింపులో తమదే తుదినిర్ణయమంటూ కేంద్రం చేసిన వాదన సరికాదనీ, నిబంధనలు నిర్దిష్టంగా ఉన్న సందర్భాల్లో తప్ప రాష్ట్రాలకు కూడా ఆ విషయంలో సమానాధికారాలున్నాయనీ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. చివరికి అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్‌ ఏ నిర్ణయమూ ప్రకటించని పరిస్థితుల్లో దోషులు దీర్ఘకాలం శిక్ష అనుభవించిన సంగతిని, వారి సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని విడుదల చేసింది.

తెలిసిచేసినా, తెలియకచేసినా నేరం చేసినవారు శిక్ష అనుభవించాల్సిందే. కానీ అందుకు కొన్ని నిబంధనలుంటాయి. శిక్ష ఉద్దేశం నేరగాళ్లను సంస్కరించటమే తప్ప వారిపై ప్రతీకారం తీర్చుకోవటం కాదు. రాజీవ్‌ విషయంలో దోషులను పట్టుకోవటం, శిక్షించటం అయింది. మరి ఇందిర హత్యానంతర మారణకాండలో సిక్కుల ఊచకోత దోషులను ఇంతవరకూ ప్రభుత్వాలు ఎందుకు శిక్షించలేకపోయాయి? న్యాయం సమానంగా ఉండటమే కాదు, అలా ఉన్నట్టు కనబడాలి కూడా. ఆ పరిస్థితి లేనప్పుడు సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం తప్పెలా అవుతుంది?

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top