ఆంగ్ల ఆధ్యాత్మికవాది | Sakshi Editorial On English writer GK Chesterton | Sakshi
Sakshi News home page

ఆంగ్ల ఆధ్యాత్మికవాది

May 27 2024 5:12 AM | Updated on May 27 2024 5:12 AM

Sakshi Editorial On English writer GK Chesterton

ఒక మనిషి ఇంత రాయగలడా అని ఆశ్చర్యానికి గురిచేసే రచయిత జి.కె. చెస్టర్‌టన్‌. ఇరవయ్యో శతాబ్దపు ఈ సుప్రసిద్ధ ఆంగ్ల రచయితకు ఇది 150వ జయంతి సంవత్సరం. 1874 మే 29న లండన్‌లో జన్మించిన గిల్బర్ట్‌ కీత్‌ చెస్టర్‌టన్‌ నవలలు, కథలు, నాటికలు, కవితలు, సాహిత్య విమర్శ, కళా విమర్శ, చరిత్ర, వ్యాసాలతో సుమారు 80 పుస్తకాలను వెలువరించారు. ‘నెపోలియన్‌ ఆఫ్‌ నాటింగ్‌ హిల్‌’, ‘ద మ్యాన్‌ హూ వజ్‌ థర్స్‌డే’ ఆయన గొప్ప నవలలు. ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ లండన్‌ న్యూస్‌’ పత్రికకు ఏకంగా 30 ఏళ్లపాటు; ‘డైలీ న్యూస్‌’కు 13 ఏళ్లపాటు వీక్లీ కాలమ్స్‌ రాశారు. 

మొత్తంగా సుమారు 4,000 వ్యాసాలు! ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తు, 130 కిలోల బరువుండే ఈ భారీకాయుడు స్టేషన్లలో కూడా రాసేవారు. రాతలో ఎంతగా మునిగిపోయేవాడంటే, ప్రతిసారీ ఎక్కాల్సిన రైలును మిస్సయ్యేవారు. పలు కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటూ, తర్వాత ఏం చేయాలో మరిచిపోయేవారు. ఒకసారైతే, ‘హార్బరో మార్కెట్‌లో ఉన్నాను. నేనెక్కడ ఉండాల్సింది?’ అని భార్యకు టెలిగ్రామ్‌ పంపారు. భర్త అన్ని వ్యవహారాలనూ చూసుకునే ఫ్రాన్సెస్‌ ‘ఇంటికి వచ్చెయ్యండి’ అని జవాబిచ్చారు.

‘ఆయన ప్రతిదాని గురించి ఎంతో కొంత, అలాగే దాన్ని అందరికంటే మెరుగ్గా చెప్పారు’ అంటారు చెస్టర్‌టన్‌ భావజాలాన్ని ప్రచారం చేయడానికి నెలకొల్పిన ‘అమెరికన్‌ చెస్టర్‌టన్‌ సొసైటీ’ సహవ్యవస్థాపకుడు డేల్‌ అహ్లిక్విస్ట్‌. క్రైస్తవ మతంలోని థీమ్స్, సింబాలిజం చెస్టర్‌టన్‌ రచనల్లో ఎక్కువగా కనబడతాయి. క్రైస్తవంలోని ప్రేమ, కారుణ్యం వైపు ఎందరినో ఆయన ఆకర్షించారు. నాస్తికుడైన బ్రిటిష్‌ రచయిత సి.ఎస్‌.లూయిస్‌ను తిరిగి క్రైస్తవుడిగా మారేట్టుగా చెస్టర్‌టన్‌ రచనలే ప్రభావం చూపాయి. 

సతతం విశ్వాసిగా మసలుకోవడమే కాక, ఎంతోమందిని విశ్వాసం వైపు మళ్లించడం, శత్రువులను కూడా ద్వేషించకపోవడం వంటి అంశాలను చూపుతూ చెస్టర్‌టన్‌ బీటిఫికేషన్‌కు యోగ్యమైన కారణాలున్నాయని వాదిస్తారు క్యాథలిక్‌ రచయిత జోసెఫ్‌ పియర్సీ. భిన్న భావజాలానికి చెందిన జార్జ్‌ బెర్నార్డ్‌ షా, హెచ్‌.జి.వెల్స్, బెర్ట్రాండ్‌ రసెల్‌ లాంటి రచయితలతో విభేదిస్తూ చెస్టర్‌టన్‌ తీవ్రమైన వాదాలు జరిపేవారు. అయినా వాళ్ల స్నేహం చెడలేదు. 

శత్రువును కూడా ప్రేమించమనే భావనే ఆయన్ని అలా మసలుకునేట్టు చేసింది. ఆయన ఈ ప్రేమగుణంలోంచి పుట్టిందే ప్రీస్ట్‌ డిటెక్టివ్‌ ‘ఫాదర్‌ బ్రౌన్‌’ పాత్ర. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా కేసులను పరిశీలించే షెర్లాక్‌ హోమ్స్‌లా కాకుండా అనుమానం, ఆధ్యాత్మిక అవగాహనల ఊతంతో నేరస్థుల మనసుల్లోకి చొచ్చుకెళ్లి వారిని పట్టుకుంటాడు ఫాదర్‌ బ్రౌన్‌. 

చెస్టర్‌టన్‌ పారిశ్రామికీకరణను వ్యతిరేకించారు. ధార్మిక జీవితాన్ని ప్రవచించారు. ఐరిష్‌ జాతీయోద్యమానికి ఊతమిచ్చారు. ఐరిష్‌ ప్రజలు ఇంగ్లిష్‌వారికి భిన్నమైనవారనీ, వారు తమవైన సంప్రదాయాలను కాపాడుకుంటూ తమ సొంత దేశంలో సొంత విధానంలో స్వతంత్ర పాలనకు అర్హులనీ వాదించారు. అయితే, ఆయన్ని ఇరవయ్యో శతాబ్దపు విలువైన థింకర్‌గా పరిగణించడానికి ఒక కారణం– ‘డిస్ట్రిబ్యూటిజం’ (పంపిణీవాదం)ను ఆయన ఎత్తుకున్న తీరు! చెస్టర్‌టన్‌ సోదరుడు సీసిల్, అతడి స్నేహితుడు హిలైర్‌ బెల్లోక్‌ ‘డిస్ట్రిబ్యూటిజం’ ఆర్థిక తత్వాన్ని వృద్ధి చేశారు. 

మొదటి ప్రపంచ యుద్ధంలో సీసిల్‌ చనిపోయాక చెస్టర్‌టన్‌ దీనికి ప్రధాన ప్రచారకర్తగా మారడమే కాక, ప్రధానంగా ఈ భావధార ప్రచారం కోసం ‘జీకేస్‌ వీక్లీ’ నడిపారు. నియంత్రణ లేని క్యాపిటలిజం, సోషలిజాలకు భిన్నమైన మూడో పంథాగా ఉంటూ, ఆస్తులు, రాజకీయాధికారాల పంపిణీ జరగాలంటుంది ఈ వాదం. ‘మూడు ఎకరాలు – ఆవు’ అనేది వీరి స్లోగన్‌.

సూత్రప్రాయంగా జాతీయవాదానికి చెస్టర్‌టన్‌ వ్యతిరేకి కాకపోయినా, తన మూలాలను విస్మరించే జాతీయవాదానికి అర్థం లేదంటారు. అందుకే భారత జాతీయోద్యమాన్ని ‘అది భారతీయమూ కాదు, అంత జాతీయమూ కాదు’ అని నిరసించారు. 1909లో ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ లండన్‌ న్యూస్‌’లో చెస్టర్‌టన్‌ రాసిన ఒక వ్యాసం మహాత్మా గాంధీ మీద ‘పిడుగుపాటు’లా పడింది. వెంటనే దానికి చిన్న పరిచయం రాస్తూ ‘ఇండియన్‌ ఒపీనియన్‌’లో పునర్ముద్రింపజేశారు. ‘వాళ్ల దేశానికి మన పార్లమెంట్‌ కావాలి, మన జ్యుడీషియరీ కావాలి, మన పత్రికలు కావాలి, మన సైన్స్‌ కావాలి. 

భారత జాతీయవాదులు ఇవన్నీ కోరుకోవడమంటే వాళ్లు ఇంగ్లిష్‌వారిలా ఉండాలనుకుంటున్నారు’ అన్నారు చెస్టర్‌టన్‌. అది సహేతుకమని గాంధీజీ బలపరుస్తూ, ‘స్వతంత్రంగా ఉండాలంటే ఇండియా తనకు తానుగా ఉండాలి, బ్రిటన్‌లా మారకూడదు. అదే పనిగా అనుకరిస్తే మన దేశం హిందుస్థాన్‌ కాదు, ఇంగ్లిషిస్థాన్‌ అవుతుంది’ అని రాశారు.

విస్తృతిలో, భావధారలో తెలుగు సాహిత్య శిఖరం విశ్వనాథను కొంతవరకూ స్ఫురింపజేసే చెస్టర్‌టన్‌కు రావాల్సినంత కీర్తి రాలేదన్నది కొందరి వాదన. ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచయిత, ఆలోచనాపరుడు అయినా  చెస్టర్‌టన్‌ విస్మరణకు గురికావడానికి ఆయన అన్ని రకాలుగా రాయడమే కారణమన్నది దీనికి వివరణ. 

‘ఒక్కమాటలో రచయితలు ఫలానా వర్గంలోకి ఇట్టే ఒదగకపోతే వాళ్లు చీలికల్లోంచి కిందికి జారిపోయే ప్రమాదం ఉంది’ అంటారు అహ్లిక్విస్ట్‌. అయినా ఆయన్ని తలకెత్తుకునేవాళ్లు ఉంటూనే ఉన్నారు. చెస్టర్‌టన్‌ను ఎడ్గార్‌ అలెన్‌ పోతో పోల్చారు బోర్హెస్‌. ‘చెస్టర్‌టన్‌కు ప్రపంచం తగినంత కృతజ్ఞత చూపలే’దని అన్నారు జార్జ్‌ బెర్నార్డ్‌ షా. అయితే జాన్‌ పైపర్‌ వ్యాఖ్యానం చెస్టర్‌టన్‌కు తగిన నివాళి: ‘చెస్టర్‌టన్‌ కోసం నేను దేవుడికి కృతజ్ఞత చెబుతాను’ అన్నారాయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement