అపర చాణక్యం

Sakshi Editorial About G-7 Summit

ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో ఏడింటి అధినేతలు జర్మనీలోని బవేరియాలో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, కరోనా అనంతర కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో సవాళ్ళు, పర్యావరణ మార్పులు – ఈ మూడు సమస్యల నేపథ్యంలో ‘జీ–7’ దేశాల తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా ఎగుమతులపై ఆధారపడడం సహా కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం లేకున్నా, వర్తమాన సంక్షుభిత కాలంలో ‘జీ–7’ దేశాలు ఐక్యతా రాగం ఆలపించడం విశేషం.

మూడు రోజుల ఈ సమావేశానికి భారత్, అర్జెంటీనా, ఇండొనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికాల నేతలు అతిథులు. అంటే, పారిశ్రామికీకరణలో ప్రపంచంలోనే ముందంజలో ఉన్న దేశాలు సైతం వాతావరణ సంక్షోభం, ఆహార – ఆరోగ్య భద్రత లాంటి అంశాల పరిష్కారానికి వర్ధమాన ప్రపంచాన్ని సైతం కలుపుకొని పోవడమే మార్గమని గుర్తించాయన్న మాట. ‘బ్రిక్స్‌’ వర్చ్యువల్‌ సమావేశం, ఆ వెంటనే ‘జీ–7’ ఆహ్వానం – వరస చూస్తుంటే ఎదుగుతున్న అగ్రదేశంగా భారత్‌ తన పట్టు చూపుతోంది. అంతర్జాతీయ యవనికపై అందరివాడినని అనిపించుకుంటోంది.

కలవరపెడుతున్న ఉక్రెయిన్‌ అంశం ‘జీ–7’లోనూ చర్చకు వచ్చింది. ఉక్రెయిన్‌లో దీర్ఘకాల యుద్ధం తప్పేలా లేదనీ, ఆ దేశానికి అండగా నిలవాలనీ అమెరికా, మిత్ర దేశాలు భావించాయి. ఇంధనానికై రష్యాపై ఆధారపడడంపై ఈ కూటమిలో అభిప్రాయ భేదాలున్నా, ఆ సంగతి పక్కన బెట్టి, రష్యాపై ఆంక్షలను విస్తరించాలని నిర్ణయించాయి. గతకాల వైభవంగా మిగిలిపోరాదని ‘జీ–7’ ప్రయత్నం. ఈ ధనిక ప్రజాస్వామ్య దేశాల కూటమి ఇప్పటికీ శక్తిమంతమైనదే. ఐరాస, ప్రపంచ బ్యాంక్‌ లాంటి సంస్థల్లో ఈ దేశాలే కీలక సభ్యులు.

ఒక పరిశీలకుడిలా మన ‘జీ–7’కి మన ప్రధాని మోదీ ఆతిథ్యం అందుకున్నారు. ఇంధనం తర్వాత రష్యా అత్యధికంగా ఎగుమతి చేసే బంగారంపైన నిషేధం, చమురు ధరలపై నియంత్రణ లాంటి ఆంక్షలను ‘జీ–7’ వేదిక చర్చించింది. రష్యా నుంచి మనం తక్కువ రేటుకు ఇంధనం కొనుగోలు చేస్తుండడం, ఉక్రెయిన్‌పై రష్యా వ్యతిరేక వైఖరిని అవలంబించకపోవడం లాంటివి సహజంగానే అమెరికా సహా ఆ దేశాలేవీ జీర్ణించుకోలేని వ్యవహారం. కానీ, ఎప్పటిలానే ‘జీ–7’లోనూ ఆ ఒత్తిడిని భారత్‌ సమర్థంగా ఎదుర్కొంది. చర్చల ద్వారా శాంతి స్థాపనే ఉక్రెయిన్‌ సంక్షోభానికి పరిష్కారమన్న మన వైఖరిని పునరుద్ఘాటించింది.

‘జీ–7’లో మోదీ పాలుపంచుకోవడం ఇది ముచ్చటగా మూడోసారి. ఈసారి పర్యావరణం, ఇంధనం, ఆరోగ్యం, ఆహార భద్రత, లైంగిక సమానత్వానికి సంబంధించిన సదస్సుల్లో మన దేశం పాల్గొంది. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సవాళ్ళపై ఎప్పటికప్పుడు అనేక అంతర్జాతీయ వేదికలపై మాట్లాడిన భారత్‌ ఇప్పుడూ తన మునుపటి మాటనే ప్రస్తావించింది. 2019 నాటి ‘జీ–7’లో లానే ఈసారీ పర్యావరణంపై మనం పెట్టుకున్న లక్ష్యాలను వివరించింది. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని తొమ్మిదేళ్ళు ముందుగానే సాధించినట్టు మోదీ చెప్పుకొచ్చారు. జర్మనీ నుంచి తిరిగొస్తూ మార్గమధ్యంలో అబుధాబీలో ఆగి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కొత్త పాలకుడిని కలసి, వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ దేశ జనాభాలో 35 శాతమున్న 35 లక్షల భారత ఎన్నారైల రక్షణ, రెండు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని దృఢపరిచారు. 

ఒకపక్క అమెరికా ఛత్రఛాయల్లోని ‘జీ–7’తో స్నేహంగా ఉంటూనే, మరోపక్క చైనాతో మన కున్న తగాదాలను పక్కనబెట్టి మరీ రష్యాతో సహా అందరితో కలసి ‘బ్రిక్స్‌’లో నిర్మాణాత్మకంగా అడుగులు వేయడం మన దేశం చేస్తున్న చిత్రమైన సమతూకం. అసలు ‘బ్రిక్స్‌’ ప్రాసంగికత ఎంత అని పలువురు అనుమానపడ్డారు. కానీ పలు సంస్థా్థగత సంస్కరణలు చేపట్టినందున వర్ధమాన దేశాల అవసరాలను తీర్చడంలో ఈ గ్రూప్‌ ప్రభావశీలమైనదని మోదీ నొక్కిచెప్పడం గమనార్హం.

అదే సమయంలో ప్రపంచ దేశాలన్నిటికీ ఇంధనం అందుబాటులో ఉండాలనీ, అది కేవలం ధనిక దేశాల విశేషాధికారం కాకూడదనీ ‘జీ–7’లోనూ మోదీ మరోసారి ఎలుగెత్తడం విశేషం. రాగల 20 ఏళ్ళలో భారత ఇంధన అవసరాలు రెట్టింపు అవుతాయని భావిస్తున్న వేళ, ఇవాళ్టికీ దేశమంతటా నిరంతరాయ విద్యుత్‌ సరఫరా లేని పరిస్థితుల్లో ఇది కీలకం. ప్రపంచానికి పర్యావరణ హిత టెక్నా లజీని అందిస్తూ, బాసటగా ఏటా 100 బిలియన్‌ డాలర్లిస్తామని పాశ్చాత్య ప్రపంచం ఎన్నడో మాట ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోని దేశాల్ని మేలుకొల్పడానికి ‘జీ–7ను భారత్‌ వాడుకోవడం బాగుంది. 

గమ్మత్తేమిటంటే, ‘జీ–7’ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ తమ తమ గడ్డపై అంతర్జాలంలోనూ, బయటా భావప్రకటన స్వేచ్ఛ, స్వతంత్ర అభిప్రాయాలనూ పరిరక్షించి, ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తామంటూ ప్రతిన బూనడం. ఇది మంచి చర్యే. కానీ, అమెరికా, ఇటలీ మొదలు మన దాకా ప్రతిచోటా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బట్టి మైనారిటీల కన్నా మెజారిటేరియనిజమ్‌ వైపే మొగ్గు ఉంటోందని ఆరోపణలు వస్తున్న వేళ ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తారా అన్నది చూడాలి.

‘జీ–7’ అయ్యీ అవగానే మ్యాడ్రిడ్‌లో ‘నాటో’ శిఖరాగ్ర సదస్సు. అక్కడ ఉక్రెయిన్‌పై సాగే వ్యూహాత్మక చర్చలకు అమెరికా ఈ ‘జీ–7’లో బాటలు వేసింది. రష్యాతో పాటు చైనా నుంచీ తలెత్తుతున్న భయాలకు తొలిసారిగా కొత్త ప్రతివ్యూహానికి ‘నాటో’ సదస్సు పచ్చజెండా ఊపవచ్చు. ఎక్కడ, ఎవరి అజెండా ఎలా ఉన్నా అపర చాణక్య నీతితో భారత్‌ తన విధానాన్ని కుండబద్దలు కొడుతూనే, స్వప్రయోజనాలు కాపాడుకొనే ప్రయత్నం చేయడం అపురూప విన్యాసమే! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top