వేడి పెంచే లాబీ క్రీ(నీ)డలా?

Climate Change And Global Warming In India Editorial By Vardhelli Murali - Sakshi

వాతావరణ మార్పులకు కారణమౌతున్న భూతాపోన్నతి నియంత్రించే లక్ష్యసాధనలో బాధ్యత కలిగిన దేశాలు వెనుకంజలో ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోలియం, బొగ్గు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగం నుంచి సౌర, పవన విద్యుత్తు వంటి పునర్వినియోగ ఇంధనాల (ఆర్‌ఈ) వైపు మళ్లే మార్పు లక్ష్యించిన స్థాయిలో లేదు. పైగా శిలాజ ఇంధన ఉత్పత్తి–వినియోగం పెరిగి, పరిస్థితి విషమిస్తోంది. మూన్నాలుగు రోజులుగా శిలాజ ఇంధన ఉత్పత్తిపై భారత్‌లో జరుగుతున్న పరిణామాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఇంధనాల వల్లే కర్భన ఉద్గారాలు పెరిగి, భూమి అసాధారణంగా వేడెక్కుతోంది.

శతాబ్ది అంతానికి 2 డిగ్రీల సెల్సియస్‌ను మించి భూతాపోన్నతి పెరక్కుండా నిలువరించటంలో వీటి నియంత్రణే కీలకం. 2030 నాటికి 1.5 డిగ్రీల మించి పెరుగనీయవద్దన్నది లక్ష్యం. ఇప్పటికే 1.1 డిగ్రీల పెరిగింది. ఈ విషయంలో ‘పారిస్‌ ఒప్పంద’ లక్ష్యాలే ఫలితమిచ్చేలా లేవని, వాటిని సవరించి మరింత కటువుగా కొత్త లక్ష్యాలు ఏర్పరచుకోవాల్సిన అవసరముందని వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమించిన ‘అంతర్‌ ప్రభుత్వాల వేదిక’ (ఐపీసీసీ) నివేదించింది. వాస్తవంలో, గడువు లోపల పాత లక్ష్యాలు సాధించడం కూడా ఇపుడు దుస్సాధ్యంగా కనిపిస్తోంది.

‘దేశీయంగా ఖరారైన మా కట్టుబాట్లివి’ (ఎన్‌డీసీ) అని, ఎవరికి వారిచ్చిన హామీలు సాధించే శ్రద్ద కూడా ఆయా ముఖ్య దేశాల్లో లోపించింది! ఒప్పందం ప్రకారం జరగాల్సిన కార్యప్రణాళిక రచనలో, వేగంగా అమలు పరచడంలో భారత్‌తో పాటు శిలాజ ఇంధనాల ఉత్పత్తి–వినియోగం అధికంగా ఉన్న దేశాలు విఫలమైనట్టు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమపు(యుఎన్‌ఈపీ) తాజా నివేదిక చెప్పింది. కీలకాంశాలు బయటకొచ్చిన తర్వాత గురు వారం అధికారికంగానే వెల్లడైన నివేదిక విషయాలు పర్యావరణ హితైషులకు ఆందోళన కలిగి స్తున్నాయి.

75 శాతం ప్రపంచ శిలాజ ఇంధనాల్ని ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, భారత్, ఇండొనేషియా, ఖజకిస్తాన్, మెక్సికో, నార్వే, రష్యా, సౌధీ అరేబియా, యుఏఈ, యుకె, అమెరికాలే ఉత్పత్తి చేస్తాయి. ‘హామీ ఇచ్చినట్టు తగ్గించక పోగా... వారి ఇంధన–ఉత్పత్తి ప్రణాళికల సరళి చూస్తుంటే... 2030 నాటికి 110 శాతం, 2040 నాటికి 190 శాతం అధికంగా శిలాజ ఇంధ నాల్ని ఉత్పత్తి చేసే పరిస్థితిని అంచనా వేస్తున్నాం’ అని నివేదిక చెప్పింది. భాగస్వాముల సదస్సు (కాప్‌–26) వచ్చే వారమే గ్లాస్‌గో (స్కాట్లాండ్‌)లో మొదలుకానున్న తరుణంలో ఇది చికాకు కలిగించేదే!

భారత్‌లో పరిణామాలూ ఏమంత బాగోలేవు! ఇటీవలి బొగ్గు సంక్షోభం, విద్యుత్తు ఇతర పారిశ్రామిక అవసరాలకు బొగ్గు పెంచుకునే చర్యలు–సన్నాహాల్ని చూస్తూనే ఉన్నాం. ‘ఆత్మనిర్బర్‌ భారత్‌’లో భాగంగా బొగ్గు తవ్వకాల్ని పెంచే మౌలిక సదుపాయాల కోసం కేంద్రం యాబై వేల కోట్లు వెచ్చించనుంది. 2019–2024 మధ్య బొగ్గు ఉత్పత్తిని సుమారు 60 శాతం (730 నుంచి 1,149 టన్నులకు) పెంచే ప్రణాళికలు అమలవుతున్నాయి. భూసేకరణ అవాంతరాల్ని తొలగించే వ్యూహమూ ఇందులో భాగమే! ఇదే కాలానికి.. చమురు, సహజవాయు ఉత్పత్తి 40 శాతం పెంచా లన్నది లక్ష్యమట.

లైసెన్సుల సరళీకరణ, గుర్తించిన వనరు నిక్షేపాలను సంపదగా మార్చడం, సహజవాయు రవాణా సంస్కరణల  ద్వారా భారీ లక్ష్యాలు సాధించాలని యోచన! ఉత్పత్తి మౌలిక రంగంలోనో, పన్ను రాయితీల్లోనో పన్నెండు వేల కోట్లు వెచ్చించాలన్నది నిర్ణయం. పెట్రో ఉత్పత్తి పెంచి, ధరల్ని హేతుబద్దం చేయాలని ‘పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌)’ను భారత్‌ కోరింది. మరోవైపు ప్రపంచ చమురు కంపెనీల సీఈవోలతో మన ప్రధాని మోదీ సమావేశమై... దేశీయంగా చమురు, సహజవాయు ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రణాళికలివ్వాలని కోరారు. చమురు దిగుమతుల భారం, విదేశీమారకం తరుగుదల తమకు కష్టంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మన చమురు అవసరాల్లో 85 శాతం, సహజవాయు అవసరాల్లో 55 శాతం దిగుమతే! కనుక దేశీయ ఉత్పత్తిపై దృష్టి. ఈ పరిణామాలన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి–వినియోగాన్ని పెంచేవే! కానీ, పారిస్‌లో మన నిర్దిష్ట హామీ (ఎన్డీసీ) ఏమిటి? 2005 బెంచి మార్కుగా, 2030 నాటికి 33–35 శాతం ఉద్గారాలను, ఆ మేర శిలాజ ఇంధన వాడకాన్నీ తగ్గిస్తామని ఒప్పందంపై సంతకం చేశాం. ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతున్న కాప్‌–26 వేదిక నుంచి రేపేమని సమాధానమిస్తారు?

మొన్న కేరళ, నిన్న ఉత్తరాఖండ్, నేడు సిక్కిం.... ఇలా అసాధారణ వర్షాల వల్ల భారీగా ప్రాణ– సంపద నష్టాల అరిష్టాలు కళ్లజూస్తూ కూడా ప్రభుత్వాలు నిద్రవీడటం లేదు. పెరిగే చమురు ధరలకు తోడు, మోయలేని కేంద్ర–రాష్ట్ర పన్ను భారంతో పౌరులు కుంగిపోతున్నారు. కార్పొరేట్‌ లాబీలు బలంగా పనిచేస్తున్నందునే పునర్వినియోగ ఇంధనాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడకంలోకి రావట్లేద నేది విమర్శ. కాప్‌–26 సదస్సుకు రోజుల ముందు ఐపీసీసీ, యుఎన్‌ఈపీ వంటి నివేదికల్లోని కీలక సమాచారం బయటకు రావడంపైనా అనుమానాలున్నాయి.

ఇంధనాల వినియోగ మార్పు లక్ష్య సాధన వాయిదా కోసం, ఉద్గార నియంత్రణ కాఠిన్యాల్లో సడలింపు కోసం ఒక బలమైన లాబీ యూఎన్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు పర్యావరణవేత్తలు, కార్యకర్తలు అనుమానిస్తున్నారు. ఇంతటి విప త్కర పరిస్థితుల్లోనూ కార్పొరేట్లకు ఎర్ర తివాచీలు పరిస్తే, వారి లాబీయింగ్‌ ఒత్తిళ్లకు లొంగితే... ఆ పాపానికి నిష్కృతి లేదు, మన ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు, ఈ పృథ్వికిక రక్షణ లేదు!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top