రాజానగరం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ రెండేళ్లు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వ పాలనపై ‘వెన్ను పోటుకు రెండేళ్లు’ పేరుతో ఈ నెల 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని బుధవారం కోరుకొండలో విడుదల చేస్తామన్నారు. 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలు, బాండ్లను దగ్ధం చేసే కార్యక్రమాలు జరగాలన్నారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పింఛన్ల పంపిణీలో జాప్యం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సర్వర్‌లో సమస్యలు తలెత్తడంతో జిల్లాలో సోమవారం పింఛన్ల పంపిణీ మందగించింది. జిల్లాలో మొత్తం 2,68,564 మంది లబ్ధిదారులకు రూ.118,84,95,000 పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయల్సి ఉండగా 83 శాతం మాత్రమే పింఛన్లు అందచేయగలిగారు. ఉదయం ఇవ్వవలసిన పింఛన్లు మధ్యాహ్నానికి కాని అందజేయలేకపోయారు. మరి కొందరికి మంగళవారం వచ్చి ఇస్తామని వెళ్లిపోయారు. దీంతో పింఛన్లు అందని వారు ఆందోళన చెందారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ‘శ్రీ షిర్డీసాయి’ విజయ భేరి
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో రాజమహేంద్రవరం శ్రీ షిర్డీ సాయి జునియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారని విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న బీఏవీవీ భార్గవ్ 47, ఎం.శ్రీనివాసరెడ్డి 54, బీఎస్ నిషాంత్ 222, ఎం.శ్రీనివాస్ 246, బీఎస్ నిహాంత్ 387, ఎ.లోహిత్‌కుమార్ 885 ర్యాంకులు సాధించారని సోమవారం చెప్పారు. ఆరుగురు వెయ్యి లోపు, 12 మంది 2 వేల లోపు, 18 మంది 5 వేల లోపు, 22 మంది 10 వేల లోపు, 32 మంది 20 వేల లోపు ర్యాంకులు సాధించినట్టు వివరించారు. విజేతలను చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ అభినందించారు.


