వేద గోదారిలో జూదఘోష! | - | Sakshi
Sakshi News home page

వేద గోదారిలో జూదఘోష!

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

జిల్లా వ్యాప్తంగా జోరుగా పేకాట

కూటమి నేతల అండదండలతో నిర్వహణ

నిత్యం రూ.కోట్లలో చేతులు మారుతున్న వైనం

ప్రత్యేక వాహనాల్లో జూదరుల తరలింపు

సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో జూదం జడలు విప్పుతోంది. అనధికార పేకాట శిబిరాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి జూదగాళ్లను తీసుకొచ్చి మరీ ఆడిస్తున్నట్టు తెలుస్తోంది. శని, ఆది వారాలు, సెలవు రోజుల్లో ఈ జూదాలు మరింత శృతి మించుతున్నాయి. రోజూ రూ.కోట్లలో చేతులు మారుతున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో ఈ దందా సాగుతుండడంతో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. పేకాటపై గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కూటమి ప్రభుత్వంలో జూదగాళ్లకు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాజమహేంద్రవరంలో రంజుగా..

నగరంలో అల్కాట్‌గార్డెన్స్‌, క్వారీ మార్కెట్‌, లింగంపేట, సీతంపేట, గోదావరి గట్టు, లంకల్లో జూదం విచ్చలవిడిగా జరుగుతోంది. నిత్యం సాయంత్రం 3 గంటల అనంతరం లంకల్లోకి వెళ్తున్న జూదరులకు అక్కడే మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఓ టీడీపీ నేత కనుసన్నల్లో ఈ తంతు సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటలోకి ఎంట్రీ ఫీజు సైతం వసూలు చేస్తున్నట్లు తెలిసింది. గెలిచిన వ్యక్తి లాభంలో 20 శాతం నిర్వాహకులకు సమర్పించుకునేలా నిబంధలు పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి మరీ జూదం ఆడిస్తున్నారు. నగరంలోని నాలుగు పేకాట కేంద్రాల ద్వారా నిత్యం రూ.2 కోట్లకు పైగా సొమ్ము చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇటీవల నగరంలోని ఓ టీడీపీ నేత నిర్వహిస్తున్న పేకాట అడ్డాలో విజయవాడ నుంచి రహస్యంగా వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు రూ.కోటి పట్టుకున్నట్లు తెలిసింది. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది.

అనపర్తిలో..

అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అనధికారిక పేట శిబిరాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి బిక్కవోలు మండలం వూలపల్లి, పందలపాక, రంగంపేట మండలం వడిశలేరు, అనపర్తి మండలం పొలమూరు, అనపర్తి నగరంలో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం.

కొవ్వూరులో..

పట్టణంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నిత్యం ఆట రంజుగా సాగుతోందని, ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఆటగాళ్లు కార్లు, ద్విచక్ర వాహనాల్లో వస్తుండటంతో ఆ పరిసరాల్లో సందడి నెలకొంటోందని తెలుస్తోంది. రెండు శిబిరాల్లో రోజుకు రూ.కోటికిపైగా చేతులు మారుతున్నట్లు తెలిసింది.

చాగల్లు మండలంలో..

కవలపల్లి, చిక్కాల గ్రామాల్లో గరువు పొలాలు పేకాట స్థావరాలుగా మారాయి. కవలపల్లిలో అనధికార జూదం నడుస్తోంది.

● రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ, రాఘవపురం, కోటికేశ్వరం, జంబూపట్నం, దోసకాయలపల్లిలలో నిత్యం అనధికారిక పేకాట శిబిరాలు సాగుతున్నాయి. వీటిపై అధికారుల స్పందన కరువడం, కూటమి నేతల ఆధ్వర్యంలో నడుస్తుండటంతో అటువైపు కన్నెతి చూసేవారు లేరు.

సింగవరంలో..

నిడదవోలు మండలం సింగవరం గ్రామం పేకాట, ‘కోడిపందేలకు పెట్టింది పేరు. ఇతర జిల్లాల నుంచి భారీగా ఇక్కడికి తరలి వస్తారు. ప్రతి రోజూ రూ.కోట్లల్లో పందేలు నడుస్తుంటాయి. ఇక్కడి పరిస్థితి ‘మూడు ముక్కలు ఆరు కోళ్లు’ అన్న చందంగా మారుతోంది. శని, ఆది వారాల్లో పక్క జిల్లాల నుంచి ఆటగాళ్లు భారీగా తరలివస్తున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.కోటి, శని, ఆదివారాల్లో రూ.2 కోట్లు చేతులు మారుతున్నాయి. ఇటీవల పేకాటలో స్వాధీనం చేసుకున్న డబ్బుల్లో తేడాలు రావడంతో ఉన్నతాధికారులు ఓ కన్నేశారు. ఆరా తీసి అప్పట్లో పెరవలి ఎస్సై, నిడదవోలు సీఐలు వీఆర్‌కు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఖండవల్లి, ముక్కామలలో పేకాట జోరందుకుంటోంది. కానూరు, తీపర్రుల్లో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పేకాటగాళ్లు వస్తుంటారు. ఉండ్రాజవరం మండలంలో సైతం ఇదే సాగుతోంది.

పోలీసుల పాత్రపై అనుమానాలు..?

పేకాట కేంద్రాలపై అప్పుడప్పుడు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా.. ఎక్కువగా చిన్నస్థాయి నిర్వాహకులు లేదా ఆడేవారిపైనే కేసులు నమోదు అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అసలు శిబిరాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీస్‌ స్టేషన్లకు నెలవారీ మామూళ్లు చేరుతున్నాయన్న ప్రచారం కూడా స్థానికంగా చర్చకు దారితీస్తోంది. అందుకే పెద్ద నాయకుల అనుచరులు నిర్వహించే శిబిరాల జోలికి పోలీసులు వెళ్లరన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పేదలే సమిధలు

పేదలు, మధ్య తరగతి ప్రజల బతుకులలో పేకాట పెను ప్రభావం చూపుతోంది. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును వారు జూద క్రీడలో పెడుతున్నారు. ఆటలో ఓడి అప్పులపాలవుతున్నారు. తిరిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుని అప్పుచేసి డబ్బులు తీసుకెళుతున్నారు. ఇలా ప్రతి సారి నిరాశే ఎదురవుతోంది. వెరసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి పాత రోజులు తీసుకువెళ్తోంది.

జాతర ముసుగులో..

సీతానగరం మండలం చిన్న కొండేపూడిలో జాతర ముసుగులో శనివారం రాత్రి భారీ ఎత్తున పేకాట ఆడించినట్లు ఆరోపణలున్నాయి. క్యాసినో తరహాలో ఈ దందా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలతో ఈ జూదంలో ఆడినట్టు సమాచారం. టెంట్లు వేసి ఎల్‌ఈడీ స్క్రీన్‌లు పెట్టి ఆడించినట్లు తెలిసింది. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన పేకాట దిగ్గజాలందరూ ఇక్కడ ఆటలో పాల్గొన్నట్లు సమాచారం ఉన్నా పోలీసులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement