అలా.. హామీల జెల్ల | - | Sakshi
Sakshi News home page

అలా.. హామీల జెల్ల

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

ఉమ్మడి జిల్లాకు పలు సందర్భాల్లో

చంద్రబాబు వాగ్దానాలు

నేటికీ అతీగతీ లేని వైనం

నేడు చామవరంలో సీఎం పర్యటన

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగాను, ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తరువాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఆ సందర్భంగా ఎడాపెడా అనేక హామీలు ఇచ్చారు. అవేవీ ఆచరణకు నోచుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సోమవారం ఆయన పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే జనం గంపెడాశతో ఎదురు చూస్తూంటారు. ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడి నుంచి వెళ్లిన నెలకో, రెండు నెలలకో కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తారు. కానీ, గతంలో పలు సందర్భాల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ అమలుకు నోచలేదు. సీఎం పర్యటన సందర్భంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇలా తమకు జెల్ల కొట్టడం మాని, ఈసారైనా ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుకుంటున్నారు.

కాకినాడ జిల్లాకు జెల్ల

గతంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఒక్క ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాకినాడ తీరంలో పారిశ్రామికీకరణను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. కానీ, ఒక్క పరిశ్రమ కూడా ఇప్పటి వరకూ పట్టాలెక్కిన దాఖలాల్లేవు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పరిశ్రమలు తెస్తానన్న హామీ కూడా గాల్లో కలిసిపోయింది.

కోనసీమ.. ఒట్టి మాటలేనమ్మా..!

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం వచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తెస్తామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా ఇటు పర్యాటక అభివృద్ధీ లేదు.. అటు కొత్తగా కొబ్బరి అనుబంధ పరిశ్రమల ఊసూ లేదు.

పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉండటంతో ‘సీమ’ ప్రజలు పెదవి విరుస్తున్నారు. సీఎం అయిన తరువాత చంద్రబాబు గత ఏడాది మే 31న కాట్రేనికోన మండలం చెయ్యేరులో జరిగిన పీ4 కార్యక్రమానికి వచ్చారు. ఆ సందర్భంగా చెయ్యేరు చెరువు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన పనులు ఏడాదవుతున్నా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. స్వయంగా సీఎం చెప్పిన పనులకే దిక్కూమొక్కూ లేకుండా పోతే ఎలాగని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

‘తూర్పు’ తిరిగి దండమే..

గత ఏడాది ఏప్రిల్‌ 18న, ఈ ఏడాది చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా సందర్భాల్లో నిడదవోలులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చారు. నిడదవోలు పట్టణం పాటు ఆ మండలంలోని 23, చాగల్లు మండలంలోని 10 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ ఆసుపత్రి నిర్మాణంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టతా లేదు. ఎర్ర కాలువపై కంసాలపల్లి – మాధవరం వంతెన, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు హామీ ఎప్పుడు అమలవుతుందా అని 1,152 మంది టిడ్కో లబ్ధిదారులు ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

వంతెన నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో నిడదవోలు మండలం కంసాలపల్లి, తాడేపల్లిగూడెం మండలం మాధవరం తదితర గ్రామాల రైతులు నిరాశ చెందుతున్నారు. అలాగే, గత ఏడాది జూలై 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా 5 ఎత్తిపోతల పథకాల మోటార్లు, పంపుల మరమ్మత్తులకు నిధుల మంజూరు, కొవ్వూరు డిగ్రీ కాలేజీకి భవనాలు, మౌలిక వసతుల కల్పన, కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయడం వంటి హామీలిచ్చారు. అలాగే, చెంతనే గోదావరి ప్రవహిస్తున్నా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ఆ నది నీరు గుక్కెడు కూడా అందని సమస్యపై సానుకూలంగా స్పందించారు. కానీ, ఇవేవీ నేటికీ ఆచరణకు నోచుకోలేదు.

గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని

జనం అడుగుతున్నారు సార్‌!

ఇంకా..

సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 జనవరి 10న కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు మోపారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, రూ.50 బాటిల్‌ను రూ.200కు అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ, ఆయన గద్దెనెక్కిన రెండేళ్లుగా బీరు, బ్రాందీ, విస్కీ ఇలా ఏ బ్రాండ్‌ మద్యమైనా ప్రతి బాటిల్‌పై మద్యం మాఫియా రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా దోచుకుంటున్నా కనీస స్పందన కూడా లేదు.

నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పదేపదే హామీ ఇచ్చారు. కానీ, ఆయన గద్దెనెక్కిన తరువాత ఆ హామీ కాస్తా గాల్లో కలసిపోయిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు, అటు భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. తాజా పర్యటన సందర్భంగా గత హామీలపై చంద్రబాబు ఏం చెప్తారో.. కొత్తగా ఏ మాటల గారడీతో మభ్యపెడతారోనని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement