తాళ్లపూడి: మండలంలోని గజ్జరం గ్రామంలోని కృష్ణమ్మ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాకు అధికారులు చెక్ పెట్టారు. ఈ విషయమై ‘చెరువు మట్టి స్వాహా’ పేరుతో ప్రచురితమైన కథనంపై ఇరిగేషన్ అధికారులు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్పందించి సమాచారం సేకరించి గజ్జరంలో సాగుతున్న మట్టి తవ్వకాలను నిలిపివేయించినట్టు సమాచారం.
సొంత పార్టీలోనే అసమ్మతి
గజ్జరం చెరువులో సాగుతున్న మట్టి దోపిడీని కొందరు స్థానిక టీడీపీ నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు దండమూడి శేషు ఆదివారం సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో వైరల్‌గా మారింది. అధికారుల అనుమతితోనే కృష్ణమ్మ చెరువులో మట్టి తవ్వకాలు అని ఆ వీడియోలో ప్రకటించడంపై అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వచ్చిన వార్తలపై పోలీస్ శాఖ కూడా స్పందించి రహస్యంగా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
జలసిరి’ లేదు.. అనుమతులూ లేవు
ఈ అక్రమ తవ్వకాలపై ఇరిగేషన్ ఏఈ రాహుల్ మాట్లాడుతూ తాళ్లపూడి మండలంలో ‘జలసిరి’ కార్యక్రమం కింద ఏ ఒక్క చెరువూ మంజూరు కాలేదని స్పష్టం చేశారు. గుర్తించిన పనులన్నీ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయన్నారు. చెరువులో మట్టి తవ్వేందుకు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఒకవేళ చెరువు లోతు పనులు చేపట్టాల్సి వస్తే కేవలం ఉపాధి పథకం ద్వారానే చేయాల్సి ఉంటుందని, అక్కడ యంత్రాలు (జేసీబీలు) ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.
ఆ ‘రహస్య హస్తం’ ఎవరిది?
మూడు రోజులుగా మట్టి రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు అనుమతులు లేవని చెబుతున్నా. అధికార పార్టీ పెద్దల పేర్లు చెప్టి మట్టి తరలిస్తున్నవారెవరు? రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేయమన్నది ఎవరు? ఈ అక్రమ దందా వెనుక ఉన్న ‘రహస్య హస్తం’ ఎవరిది? అనే ప్రశ్నలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి.
సత్ప్రవర్తనతో మెలగాలి
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేర నియంత్రణ, శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర ఉన్న వ్యక్తులకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక చర్యల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, రవాణా చేస్తే తీవ్ర చర్యలు తప్పవని న్నారు. రౌడీ షీటర్లు, క్రైమ్ సస్పెక్ట్‌ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎటువంటి గొడవలు, నేరాలలో పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


