మొండి వైఖరి వీడని మిల్లు యాజమాన్యం | - | Sakshi
Sakshi News home page

మొండి వైఖరి వీడని మిల్లు యాజమాన్యం

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

విధులకు హాజరుకాని కార్మికులు

70 మంది కార్మిక నాయకులపై వేటు!

కడియం: మండలం మాధవరాయుడుపాలెంలోని ఏపీ పేపరు మిల్లు యాజమాన్యం మొండి వైఖరి వీడడం లేదు. లాకౌట్‌ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ కార్మికులపై ఆంక్షలు పెట్టడంతో వారు విధులకు హాజరు కాకుండా నిరసన కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పర్మెనెంట్‌ కార్మికులు 11 మంది, కాంట్రాక్టు కార్మికులు 59 మినహా మిగిలిన వారు విధులకు హాజరు కావచ్చంటూ ఏకపక్షంగా మిల్లు యాజమాన్యం ఆఫర్లు ఇస్తోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాడిన నాయకులను లక్ష్యం చేసుకుని యాజమాన్యం సాధిస్తోందని వారంటున్నారు. భవిష్యత్తులో పోరాటాలకు తావులేకుండా చేయాలన్న లక్ష్యంతో ఆ 70 మందిపై వేటు వేస్తోందని కార్మికులు చెప్తున్నారు. రాజమహేంద్రవరం పేపర్‌ మిల్లు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కందుల దుర్గేష్‌లకు క్లాస్‌ తీసుకున్న మర్నాడే ఇక్కడి మిల్లు లాకౌట్‌ ఎత్తేశారు. అయినప్పటికీ 70 మంది కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు మాత్రం యాజమాన్యం నిరాకరించింది. అంతే కాకుండా సమ్మె కాలంలో కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి కచ్చితమైన హామీ ఇవ్వలేదు. వేతన పెంపు, మౌలిక సదుపాయాలు, కార్మికుల పర్మెనెంట్‌ తదితర అంశాలను ప్రస్తావించలేదు. కార్మిక చట్టాలను అమలు చేయకపోయినా, పన్నులు చెల్లించకపోయినా.. వ్యర్థాలను నేరుగా నదీజలాల్లోకి వదిలేస్తున్నా.. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు మిల్లుకు వంతపాడుతుండడమే యాజమాన్యం మొండి వైఖరికి ప్రధాన కారణంగా ప్రజలు భావిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం తగిన చర్యలు చేపట్టాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

పరిహారం కోసం మృత దేహంతో బాధిత కుటుంబం ధర్నా

పోలీసులు నచ్చజెప్పడంతో విరమణ

కోరుకొండ: స్థానిక శ్రీరంగపట్నానికి చెందిన వ్యవసాయ కూలీ కర్రి అప్పలరాజు (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై రమేష్‌ తెలిపిన వివరాల మేరకు ఈనెల 26వ తేదీన అప్పలరాజును రాజమహేంద్రవరంలోని ప్రముఖ సంస్థకు చెందిన వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనను జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఢీకొన్న వాహనానికి చెందిన సంస్థ యాజమాన్యం బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంబులెన్స్‌లోని మృతదేహంతో ధర్నా చేశారు. సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి, ఎస్సై రమేష్‌ వాహనం ఢీకొట్టిన రోజే కేసు నమోదు చేశామని, బీమా వచ్చిన వెంటనే పరిహారం అందుతుందన్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు అప్పలరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement