రైతు సంక్షేమం కోసమే ముందస్తు నీరు | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమం కోసమే ముందస్తు నీరు

Jun 1 2026 12:20 AM | Updated on Jun 1 2026 12:20 AM

మంత్రి కందుల దుర్గేష్‌

గోదావరి డెల్టాకు ఖరీఫ్‌ నీటి విడుదల

బ్యారేజీ మరమ్మతులకు రూ.148 కోట్లు

ధవళేశ్వరం/నిడదవోలు: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్‌ సీజన్‌కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగు నీటిని విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజ్‌ నుంచి ఆదివారం డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌, కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, గంటి హరీష్‌ మాధుర్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులతో వచ్చిన మంత్రి దుర్గేష్‌ గేట్ల స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. తొలుత గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ముందస్తుగానే నాట్లు వేసుకొని పంటలను రక్షించుకోవాలని సూచించారు. గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ మూరలశెట్టి సునీల్‌ కుమార్‌, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీ మురళీకృష్ణరాజు, చీఫ్‌ ఇంజినీర్‌ చినబాబు, ధవళేశ్వరం ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ రామకృష్ణ, విజ్జేశ్వరం ఈఈ రమేష్‌ బాబు పాల్గొన్నారు.

పశ్చిమ డెల్టాకు నీరు

వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ స్విచ్‌ ఆన్‌ చేసి విజ్జేశ్వరం హెడ్‌ స్లూయిస్‌ నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హెడ్‌ స్లూయిస్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రభుత్వం కాటన్‌ బ్యారేజీ గేట్ల మరమ్మతులకు రూ.148 కోట్లు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. కాలువల మరమ్మతులకు మరో రూ.13 కోట్లు విడుదల చేసి, సాగునీటి సంఘాల ద్వారా 80 శాతం పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. శెట్టిపేట ఈఈ రమేష్‌బాబు, తాడేపల్లిగూడెం డీఈ కె.ధర్మజ్యోతి, నిడదవోలు ఏఈ ఎంవీవీ పెద్దిరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement