అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం భక్తజన సంద్రమే అయ్యింది. వందలాది వాహనాల్లో భక్తులు ఉదయం నుంచీ రావడంతో రత్నగిరి, సత్యగిరి పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా సైతం వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3 వేల వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సూర్య భగవానుడు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైబడిన ఉష్ణోగ్రతతో చెలరేగిపోవడంతో భక్తులు అల్లాడిపోయారు. చెట్ల నీడన, విశ్రాంతి మండపాల్లోను సేద తీరారు. ఆలయం చుట్టూ గ్రీన్ షేడ్ ఏర్పాటు చేసినప్పటికీ ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పైబడితే వేడి దిగిపోయి, భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. తూర్పు రాజగోపురానికి ఉత్తరం వైపు విశ్రాంతి షెడ్డు ఉంది. అటువంటి షెడ్డు ఆలయం చుట్టూ నిర్మిస్తే ఏ కాలమైనా భక్తులకు ఉపశమనంగా ఉంటుంది. అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.


