గతమెంతో ఘనం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీతో ఒప్పందం కుదుర్చుకుని జగనన్న పాల వెల్లువ పథకాన్ని అమలు చేసింది. అతివలు పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా వృద్ధి చెందారు. ఆ సంస్థ ఆధునిక పరికరాలతో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యతను బట్టీ లీటరు గేదె పాలు రూ.80 నుంచి రూ.100కి, ఆవు పాలు రూ.60 నుంచి రూ.80 వరకూ అందించే ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచి రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది.
2022 మే 19న హైడ్రాలిక్ సిస్టమ్‌తో కూటిన వైఎస్సార్ సంచార వైద్యశాలను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో మృతి చెందిన పశువుల బీమా కోసం కేవలం రూ.340 ప్రీమియంతో మూడేళ్ల కాల వ్యవధితో కూడిన వైఎస్సార్ పశు బీమా పథకం అమలు చేసింది.
ఫ రెండేళ్లుగా పాడి పరిశ్రమకు
ప్రోత్సాహం కరవు
ఫ చంద్రబాబు ప్రభుత్వంలో
రైతులకు కష్టాలు
ఫ నేడు ప్రపంచ పాల దినోత్సవం
కపిలేశ్వరపురం: పాడి, పంటలు ప్రగతికి మెట్లు.. ఈ రెండూ జొడెడ్ల బండ్లు.. వీటికి పాలకులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. అదే చేసింది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. అప్పట్లో అమలు చేసిన పథకాలను ప్రస్తుత చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. రెండేళ్ల పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రగతి మెట్లు ఎక్కించిన దాఖలాలు లేవు. జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
జిల్లాలో 2.75 లక్షల పశు సంపద ఉండగా, ఇందులో 1.30 లక్షల పాడి పశువులు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సగటున 7.80 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంది. ఇందులో 3.15 లక్షల లీటర్లు వర్తకుల ద్వారా ఇంటింటికీ చేరుతున్నాయి. జిల్లాలోని పశువులకు వైద్యం చేసేందుకు 9 ప్రాంతీయ ఆసుపత్రులు, 40 డిస్పెన్సరీలు, 21 రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు ఉన్నాయి. పాలు చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఆరోగ్యదాయకం. ఇందులో పుష్కలంగా విటమిన్లు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఆమ్లాలు, లవణాలు, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, మనుషుల అభిరుచిని బట్టి ఆవు, గేదె, మేక పాలను తాగుతారు. వీటన్నింటిలో పోషక విలువలు దాదాపు ఒకేలా ఉంటాయి. గేదె పాలలో వెన్నశాతం ఎక్కువగా, కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటాయి. మేక పాలు త్వరగా జీర్ణమవ్వడంతో పాటు ఎలర్జీ సమస్యలు తక్కువ వస్తాయి. లాక్టోస్ శాతం ఆవు పాలలో కంటే మేక పాలల్లో కొంచెం తక్కువ. పాలతో పాలకోవా, పన్నీరు, పెరుగు, మజ్జిగ, లస్సీ తదితర వాటిని తయారు చేస్తారు. స్వీట్ల తయారీలో నెయ్యి కీలకమైంది.
తొలి మెట్టు ఇక్కడే..
పాల ఉత్పత్తి, పశువుల్లో చూడు శాతం పెంపుదల లక్ష్యంతో ప్రస్తుత బాపట్ల జిల్లా నిడుబ్రోలులో 1962లో రాష్ట్ర పశు సంవర్థక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కపిలేశ్వరపురం జమిందారు, అప్పటి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు ప్రోద్భలంతో ఈ కేంద్రాన్ని 1963లో మండపేటకు తరలించారు. ఆరంభంలో దేశ విదేశీ పశు వైద్యులు ఇక్కడ శిక్షణ పొందేవారు. ఇప్పుడు స్వదేశీ పశు వైద్యులు ఏడాదికి సుమారు 150 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షల పాల కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నారు. పాలు కల్తీ జరిగితే ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబరు 1800 425 3857, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెడ్ ఆఫీస్ నంబరు 08645 297245కు సమాచారాన్ని చెప్పొచ్చు.
పశు పోషణ... ఎంతో భారం
ప్రస్తుతం ఎండుగడ్డి కొరత కారణంగా పశు పోషణ ఇబ్బందిగా మారింది. యంత్రాలతో కోసిన వరి గడ్డి పశుగ్రాసంగా పనికిరాదు. గతంలో ఎకరా వరి గడ్డి రూ.5 వేలు కాగా, ప్రస్తుతం రూ.9 వేల నుంచి రూ.11 వేలు పలుకుతోంది. పశుగ్రాసం ఇంటికి చేరుకోవడానికి కూలి, రవాణా ఖర్చులు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకూ అవుతాయి. తౌడు, చిరునూక దాణా బస్తా రూ.1,500 పలుకుతుంది.
పాలన..
అవస్థల మాటున
పాడి పరిశ్రమ అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 50 కిలోల బస్తా దాణా రూ.1,100 ఉండేది. ఇప్పుడు ఆ ధర కాస్తా రూ.1,500కి చేరింది. ఆర్‌ఎస్‌కే కేంద్రాల్లో పశు పోషకులకు 50 కిలోల దాణా రూ.550కు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో దాని ప్రభావం అత్యల్పం. గత చంద్రబాబు ప్రభుత్వంలో మినీ గోకులాల నిర్మాణానికి చెల్లించాల్సిన రాయితీ సొమ్మును ఎగ్గొట్టింది. తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బకాయిలు తాలుకూ కొంత సొమ్మును పాడి రైతులకు జమ చేసింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.10 లక్షలతో మెగా కమ్యూనిటీ గోకులం నిర్మిస్తామంటూ హడావుడి చేస్తుంది.
మా తండ్రిని పోగొట్టుకున్నా..
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన ఘటనలో నా తండ్రి కడలి కృష్ణారావు ప్రాణాలు కోల్పోయారు. మమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా పెంచిన తండ్రిని కల్తీ కాటు వేయడం మా కుటుంబ సభ్యుల్ని కలచివేసింది. పాలను స్వచ్ఛమైన ఆహారంగా చెబుతారు. ఆ స్వచ్ఛత ఇప్పుడు లేకపోవడం విచారకరం.
–సూరంపూడి శ్రీలక్ష్మి,
అంగర
పెట్టుబడులు భరించలేక..
నా పశువుల మకాంలో 15 గేదెలను మేపేవాడిని. పెట్టుబడులను భరించలేక ప్రస్తుతానికి ఐదు గేదెలు, ఒక ఆవును మాత్రమే మేపుతున్నాను. రోజుకు ఒక్కో పశువుకు అర కిలో చొప్పున జొన్నలు, తవుడు, పత్తి పిండి ఉదయం సాయంత్రం దాణాతో పాటు పెడతాం. కిలో జొన్నలు రూ.22, పత్తి పిండి రూ.30, శెనకచెక్క రూ.26, తవుడు రూ.17 ధర ఉంది. ఎకరా ఎండుగడ్డి రూ.11 వేలు పలుకుతుంది. ఇన్ని కష్టాలు పడితే లీటరు పాలు సేకరణ కేంద్రంలో రూ.80 చొప్పున మాత్రమే వస్తుంది.
–సాధనాల శివభగవాన్, పాడి రైతు, మండపేట
కలవరపెడుతున్న కల్తీ
చారిత్రక రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 16న కల్తీ పాల సరఫరా ఘటన మొత్తం మానవ సమాజాన్ని భయాందోళనకు గురిచేసింది. సంపూర్ణ ఆహారంగా కీర్తించే పాలు కల్తీ కావడంతో 21 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అందులో 17 మంది కిడ్నీలు పాడై ప్రాణాలను కోల్పోయారు.


