ఫ చెలరేగిపోతున్న మట్టి మాఫియా
ఫ దేవస్థానం భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు
ఫ పట్టించుకోని అధికారులు
కరప: ఈ చిత్రం చూస్తే ఏదో ఇండస్ట్రీ నెలకొల్పి, వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారేమో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇది మట్టి మాఫియా బరి తెగింపునకు పరాకాష్ట. మమ్మల్ని ఆపేదెవరంటూ రేయింబవళ్లు అదేపనిగా మట్టిని తరలించుకుపోతున్నారు. కరపలోని దేవదాయ శాఖ భూముల్లో జరుగుతున్న తంతు ఇది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కరపలో విష్ణ్వాలయం, శివాలయాలు ఉన్నాయి. వీటికి దేవదాయ శాఖ ఆధీనంలో విష్ణ్వాలయానికి సంబంధించి వేణుగోపాల స్వామివారికి సుమారు 18 ఎకరాలు, శివాలయానికి సంబంధించి రామలింగేశ్వర స్వామివారికి సుమారు 22 ఎకరాల పంట భూమి ఉంది. ఈ భూములకు మూడేళ్లకోసారి బహిరంగ వేలం పాట నిర్వహించి, పంట భూముల సాగుకు పాడుకున్న రైతులకు అప్పగిస్తారు. రైతులు ఎకరానికి ఒక్కొక్క పంటకు 10 బస్తాల చొప్పున కౌలుకు లెక్కకట్టి, తమ కాయకష్టాన్ని కలుపుకొని పాట పాడతారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల క్రితం అధికార పార్టీ నాయకుల కన్ను దేవస్థానం భూములపై పడింది. వేలం పాట సమయంలో సదరు నాయకులు వెళ్లి దేవుడికి ఆదాయం పెంచుతామని బిల్డప్ ఇచ్చి హెచ్చురేటుకు, అంటే ఎకరానికి రూ.10, రూ.15 వేలు అదనంగా పెట్టి పాడేసి, దేవస్థానం భూములను దక్కించుకున్నారు. రబీ పంట కోతలు పూర్తవ్వగానే సదరు దేవస్థానం భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి, రూ.వేలు వెనకేసుకుంటున్నారు. భూమిని సాగు చేసుకోవడమే కానీ సదరు భూముల్లో చెట్లను నరకడం, మట్టి తీయడం చేయకూడదని వేలం పాట సమయంలో దేవదాయ శాఖాధికారులు నిబంధనలు వెల్లడిస్తారు. ఆ భూములు పాడుకున్న అధికార పార్టీ నాయకులు సదరు నిబంధనలను తుంగలో తొక్కి, నిరంతరం మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వందల ట్రాక్టర్లతో సెలవు రోజుల్లో అధికారులు పట్టించుకోరులేనని మట్టి తవ్వి తరలించేస్తున్నారు. గతంలో మట్టి అక్రమ తవ్వకాలపై అధికారులు దాడులు జరిపి, ట్రాక్టర్లను, పొక్లెయినర్లను సీజ్ చేసేవారు. కూటమి ప్రభుత్వంలో తమ కళ్ల ముందే మట్టి ట్రాక్టర్లు తిరుగాడుతున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికై నా మైనింగ్, దేవదాయ, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖల అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.


